
రూ. పది లక్షలిస్తే దుకాణం పదిలం!
ప్రత్యామ్నాయం చూపాలి
గుంటూరు నగర పాలక సంస్థ అధికారుల దందా కొల్లి శారద మార్కెట్ దుకాణాల కోసం వసూళ్లు న్యాయం చేయాలని వ్యాపారుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్: నగరంలోని కొల్లి శారద మార్కెట్ పాత లీజుదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. 25 సంవత్సరాలుగా ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకుంటున్న తమను లీజు గడువు పూర్తయిందంటూ హడావుడి చేసి బయటకు పంపారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముడుపులు ఇస్తే రెన్యూవల్?
మార్కెట్‌లో 81 షాపులున్నాయి. ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున రూ.8.10 కోట్లు ఇస్తే రెన్యూవల్ చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు మధ్యవర్తుల ద్వారా చెప్పారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. అంత స్తోమత లేక అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో వ్యాపారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక్కడికి కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క తాము రైతులను కొల్లి శారద మార్కెట్‌కు వెళ్లనివ్వడం లేదనడం సమంజసం కాదని వాపోతున్నారు.
లీజుకు ముందు చెప్పలేదు..
నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారులను నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 1999లో అప్పటి కమిషనర్ కృష్ణబాబు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కొల్లి శారద మార్కెట్‌కు తరలించారు. మార్కెట్‌కు వెళ్లే ముందు లీజు గడువు విషయం తమకు చెప్పలేదని తెలిపారు. ఈ క్రమంలో 2013లో జీఓ వచ్చిందని నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా షాపులను ఖాళీ చేయాలని, బహిరంగ వేలం పెట్టాలని చెప్పారు. మరో పక్క ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఇబ్బందులను తట్టుకోలేక బుడంపాడు బైపాస్ వద్ద నాలుగు ఎకరాల స్థలం కొనుగోలు చేశామన్నారు. అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులను కోరినా కుదరదన్నారని వ్యాపారులు చెప్పారు. లీజు గడువు పూర్తయిందని హడావుడిగా వేలం పాట పెట్టేశారన్నారు. ఒక్కో షాపు రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షల వరకు పలికిందని చెప్పారు అంత పెట్టి వ్యాపారం చేయలేమని బుడంపాడు బైపాస్ వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్‌లోకి వెళ్లామన్నారు. వ్యాపారం చేయడానికి వీల్లేదని అధికారులు ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు.
రూ.లక్షలు కట్టి తాము కొల్లి శారద మార్కెట్‌లో వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేవని వ్యాపారులు తెలిపారు. తాము ప్రైవేట్ స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో మార్కెట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇంత వరకు స్పందన లేదని చెప్పారు. అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో వ్యాపారం చేసుకోనివ్వడం లేదని వాపోయారు.