
విగ్రహ ప్రతిష్ట సంబరాల్లో టీడీపీ నేతల వీరంగం
సుంకం చెల్లిస్తేనే కార్యక్రమాలు జరపాలంటూ ఆదేశం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న గ్రామస్తులు, మహిళలు సమస్య పరిష్కారానికి ఎస్‌ఐ హామీ వెనుదిరిగిన మహిళలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: నూజెండ్ల మండలం పమిడిపాడులో గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట సందర్భంగా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. గ్రామంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామస్తులు విరాళాలు సేకరించారు. ప్రతిష్ట అనంతరం అన్నదాన సంతర్పణ సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ నేత అనుచరులతో వచ్చి భోజనం చేస్తున్న వారితో ఘర్షణకు దిగాడు. అక్కడ ఉన్న నిర్వాహకులు ప్రతిష్ట సజావుగా జరగాలని ప్రాథేయ పడినప్పుటికీ భోజనం బల్లలను, వంట సామగ్రి పడివేసి గందరగోళం సృష్టించాడు. అంతే కాకుండా గ్రామంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా తమకు సుంకం చెల్లించాలని, లేనిపక్షంలో కార్యక్రమాలు నిర్వహించటానికి వీల్లేదని హెచ్చరించాడు. గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో వినుకొండ పట్టణంలో ఉన్న ఐనవోలు పోలీసుస్టేషనుకు చేరుకొని ఎస్‌ఐ ఎదుట మొరపెట్టుకున్నారు. గ్రామంలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని, ఏ పని చేయాలన్నా సుంకం చెల్లించాలని లేకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని ఎస్‌ఐ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం రాత్రి సమయంలో మహిళలు పోలీసుస్టేషను ఎదుట రెండు గంటల నిరీక్షించారు. స్పందించిన ఎస్‌ఐ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారిస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు తిరిగి గ్రామానికి వెళ్లారు.