
అనారోగ్య సమస్యలతో వృద్ధురాలి ఆత్మహత్య
కొల్లూరు : అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం కొల్లూరులో చోటు చేసుకుంది. మండలంలోని సుగ్గునలంకకు చెందిన సుగ్గున వెంకటసుబ్బమ్మ (75) కొంత కాలంగా ఉబ్బసం, ఆయాసంతో బాధ పడుతోంది. ఇటీవల గుంటూరులోని వైద్యశాలలో చికిత్స పొంది ఇంటికి చేరింది. అనారోగ్య సమస్యలు నయం కాకపోవడంతో కొల్లూరు లాక్ సెంటర్‌లో పశ్చిమ బ్యాంక్ కెనాల్‌లోకి దూకింది. స్థానికంగా చేపలు విక్రయించే వ్యక్తులు గమనించి నీటిలో కొట్టుకుపోతున్న ఆమెను పట్టుకొని ఒడ్డుకు తీసుకువచ్చారు. తాగిన నీటిని కక్కించి రక్షించేందుకు విఫలయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వెంకటసుబ్బమ్మ మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే, దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని వారు వెల్లడించారు.