
జీఎస్టీ తగ్గడంతో దిగొచ్చిన విద్యుత్ పరికరాలధరలు
సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రయోజనం విద్యుత్‌శాఖ అధికారుల అవగాహన ర్యాలీ
నరసరావుపేట: సూపర్ సేవింగ్స్–సూపర్ జీఎస్టీ వల్ల విద్యుత్ పరికరాల ధరలు తగ్గాయని విద్యుత్ శాఖ జిల్లా అధికారి డాక్టర్ ప్రత్తిపాటి విజయకుమార్ పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చే వారికి లాభం కలుగుతుందని తెలిపారు. శనివారం సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్, సోలార్ విద్యుత్ అవగాహన ర్యాలీకి స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో పచ్చ జెండా ఊపి ప్రారంభించి అందులో పాల్గొన్నారు. ర్యాలీ శివుడు బొమ్మ సెంటర్ మీదుగా ప్రధాన రహదారిలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు, అక్కడి నుంచి పాండురంగస్వామి దేవాలయం మీదుగా కోట సెంటర్ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు కొనసాగింది. విద్యుత్ శాఖ సిబ్బంది ప్లకార్డులు పట్టుకొని దారి పొడవునా కరపత్రాలు పంపిణీ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్.రాంబొట్లు మాట్లాడుతూ గృహ వినియోగదారులకు అదనపు లోడు ఉంటే 50 శాతం రాయితీ ద్వారా క్రమబద్ధీకరణ పథకం ఉందని తెలిపారు. దీన్ని ప్రతి ఒక్క గృహ వినియోగదారుడు ఉపయోగించుకోవాలని కోరారు. ర్యాలీలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాద్, అసిస్టెంట్ ఇంజినీర్లు రఫీ, సురేంద్రబాబు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు సాంబశివరావు, మౌళి, ప్రసాద్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.