
పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
రెంటచింతల: రెంటచింతల పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్‌ఐకి సూచించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల జరిగే ప్రమాదాలతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. గ్రామాలలో చిన్న చిన్న విషయాలకే ప్రజలు ఆవేశంతో ఘర్షణ పడుతున్నారన్నారు. ఏ ప్రాంతంలోనైనా గొడవ జరుగుతుందని తెలిసిన వెంటనే పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి, సర్దుబాటు చేయడంపై కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున పాల్గొన్నారు.