
వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: వాల్మీకి మహర్షి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అన్నారు. యుగాలు మారినప్పటికీ రామాయణం ఇచ్చే ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి మనిషిలో ఉన్న చెడును తొలగించి మంచి దారిలో నడిపించే శక్తి వాల్మీకి రచనల్లో ఉందన్నారు. రామాయణ స్ఫూర్తితో కుటుంబ, మానవతా విలువలను పెంపొందించుకోవాలని, ధర్మబద్ధంగా జీవించాలన్నారు. ఎస్.బి. సీఐ జి.నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.