
జాతీయ అథ్లెట్ రష్మిశెట్టికి ఘన సన్మానం
లక్ష్మీపురం: జాతీయ అథ్లెటిక్స్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌కి చెందిన టీటీఐ(రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్) రష్మిశెట్టి కాంస్య పతకం సాధించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రష్మిశెట్టి 64వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ ప్రధానంగా జాతీయ క్రీడా పోటీలలో గుంటూరు రైల్వే డివిజన్ తరుఫున జావెలిన్ త్రోలో పాల్గొని సత్తా చాటిన రష్మి శెట్టిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
రైతు ద్విచక్ర వాహనం నుంచి
రూ. 3 లక్షలు చోరీ
సత్తెనపల్లి: సినీఫక్కీలో గుట్టుచప్పుడు కాకుండా వెంబడించి రైతు ద్విచక్ర వాహనంలో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 3 లక్షలు నగదు కాజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన రైతు బూతుకూరి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. బంగారు నగలు కుదువపెట్టి రూ. 3 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆ నగదును ద్విచక్ర వాహనంలో పెట్టుకొని మాచర్ల రోడ్‌లో గల పెద్ద మసీదు ఎదురు గల తిరుమల ఫర్టిలైజర్స్ ముందు ద్విచక్ర వాహనం ఆపి ఆ కొట్లో ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఎరువులు కొనుగోలు చేసి తిరిగి నగదు కోసం ద్విచక్ర వాహనం వద్దకు రాగా అప్పటికే బ్యాంకు వద్ద నుంచి మాటు వేసిన గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంలోని నగదును చోరీ చేశాడు. ద్విచక్ర వాహనంలో నగదు లేకపోవడాన్ని గుర్తించిన శ్రీనివాసరెడ్డి లబోదిబోమంటూ హుటాహుటిన పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ ఎస్‌ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.