
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.10.30 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా రూ.10.30 కోట్లను సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారంతో పూర్తయింది. తొలిరోజున రూ.3,57,92,708 నగదు, 122 గ్రాముల బంగారం, 9.7 కిలోల వెండి లభ్యమవగా..రెండో రోజు రూ.6,73,02,813 నగదు, 265 గ్రాముల బంగారం, 9.750 కిలోల వెండి లభ్యమైంది. దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా 480 సంచులతో దుర్గమ్మకు కానుకలు వచ్చాయి. వీటిని లెక్కించగా రూ.10,30,95,521 నగదు, 387 గ్రాముల బంగారం, 19.450 కిలోల వెండి లభ్యమైంది. గతేడాది కంటే దాదాపు కోటి రూపాయలు హుండీల ద్వారా అదనంగా లభించింది.