సుమోటో కేసు నమోదు చేయాలి
చీరాల: ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయకపోడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగినట్లుగా చెబుతున్న ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలని, సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. అమరులైన వారి బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల మండలం జాండ్రపేటలో సజ్జా నాగేశ్వరరావు సోదరుడు సజ్జా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సంఘ నాయకులు అంజమ్మ మాట్లాడుతూ ఈ నెల 20న మరణించిన అమరుల మృతదేహాలను భద్రపరచకుండా కాలయాపన చేస్తూ మృతదేహాలు కుళ్లిపోయే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. శవాలపై కూడా హింసను ప్రయోగిస్తోందన్నారు. అంతిమ సంస్కారాల కోసం మృతదేహాలను అప్పగించకపోవడం హిందూ సంప్రదాయానికి విరుద్ధమన్నారు. విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ, రాష్ట్ర చేనేత జనసమాఖ్య వ్యవస్థాపకులు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ మధ్య భారతదేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై కొనసాగుతున్న సైనిక చర్యల ద్వారా మానవహననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధులు పలుమార్లు శాంతి చర్చలకు సిద్ధమని, అందులో భాగంగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఏకపక్షంగా సైనిక చర్యలకు పాల్పడుతూ దేశంలో భయానక పరిస్థితులను కేంద్రం సృష్టిస్తోందన్నారు. సజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమ సోదరుడు మరణించిన విషయం గానీ, మృతదేహాన్ని తీసుకువెళ్లాలనిగానీ సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచించి నాగేశ్వరరావు మృతదేహాన్ని అందజేయాలన్నారు. వారి వెంట ప్రగతిశీల కార్మిక సమాఖ్య కొండారెడ్డి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వై.వెంకటేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ నేత పి.పుల్లయ్య, రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకులు దేవన వీరనాగేశ్వరరావు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, జ్యోతిర్మయి దేవాంగ సమితి బీరక పరమేష్ తదితరులున్నారు.
నారాయణపూర్ అమరులకు చెందిన బంధుమిత్రుల సంఘం డిమాండ్


