అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
కలెక్టర్ జోక్యంతో నకిలీ భూ దందాలపై నిజాలు నిగ్గు తేలేనా? సూత్రధారులపై చర్యలు తీసుకోవాలంటున్న రైతులు, ప్రజాసంఘాలు
హైకోర్టులో ప్రైవేటు కేసులు వేశాను
మార్టూరు: మార్టూరు కేంద్రంగా గత సంవత్సర కాలంగా జరుగుతున్న నకిలీ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ దృష్టి పెట్టడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశాలపై జాయింట్ కలెక్టర్ భావన శనివారం రాత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, భూ దందాలపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ దందాకు సంబంధించిన అధికారులతోపాటు ప్రైవేటు వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురై బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ నివేదికలోని అంశాలపైనే కాకుండా కలెక్టర్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను లోతుగా అధ్యయనం చేసి సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రధానంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిన విషయం ఇక్కడ బహిరంగ రహస్యం. ఆకస్మిక తనిఖీలు.. రికార్డుల పరిశీలన అంటూ నెలలో రెండు మూడు పర్యాయాలు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించే ఆర్డీఓ గ్లోరియా ఏం తెలుసుకుంటున్నారంటూ రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ జరిగే అరాచకాలన్నీ కార్యాలయ కీలక ఉద్యోగి కనుసన్నలలోనే జరుగుతున్నట్లు సదరు సిబ్బంది చెప్పడం గమనార్హం. విచారణలో భాగంగా కలెక్టర్.. మార్టూరు తహసీల్దారు కార్యాలయం వద్ద బహిరంగ విచారణ చేపడితే బాధితుల సంఖ్య పెరుగుతుందనడటంలో సందేహం లేదు.
తహసీల్దార్‌పై ప్రైవేటు కేసులు
మ్యూటేషన్లకు సంబంధించిన ఫైళ్లపై ఆర్‌ఐ అశోక్.. డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మిల రిపోర్టులు కానీ, సంతకాలు కానీ లేకుండానే ప్రశాంతంగా జరిగిపోవటం ఇక్కడ సర్వసాధారణమైంది. తహసీల్దార్ ప్రశాంతిపై బాధిత రైతులు హైకోర్టులో ప్రైవేటు కేసులు వేయడం చూస్తే ఇక్కడ ఎంత అరాచకం నడుస్తుందో అర్థమవుతోంది. ప్రభుత్వ భూములకు రూ.లక్షలు తీసుకొని అడ్డగోలుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం, ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులకు అప్పనంగా దోచిపెట్టడం ఆమెకు సర్వసాధారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నకిలీ ధ్రువీకరణ పత్రాల మంజూరు వివాదాన్ని ఎదుర్కొంటున్న వీఆర్‌ఓ బాలసుబ్రహ్మణ్యం సుమారు 15 ధ్రువీకరణ పత్రాలు విక్రయించినట్లు సమాచారం. గతంలో వీఆర్వోగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన ప్రసన్న, ప్రస్తుత వీఆర్వో మీనా.. తహసీల్దార్ కనుసన్నల్లో జారీ చేసిన నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై కూడా కలెక్టర్ విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) జారీ చేసిన కనీస నిబంధనలు సైతం పాటించకపోవడం అధికారుల బరితెగింపునకు నిదర్శనం. నిజాయతీ అధికారిగా పేరు ఉన్న డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి తన సీటులో పనిచేసే టైం కంటే కార్యాలయంపై బాధితులు వేసే కోర్టు కేసుల కోసం వెచ్చించే సమయమే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. దీనిపై సీపీఎం నాయకుడు వై.రాంబాబు మాట్లాడుతూ మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్కు రైతు సంఘం తరఫున చాలాసార్లు చెప్పామన్నారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాలపై అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని చెప్పారు. ఇక్కడి పరిస్థితి కంచే చేను మేస్తున్న చందంగా ఉందన్నారు. కలెక్టర్ బహిరంగ విచారణ జరిపి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
మా కుటుంబానికి గ్రామంలో సర్వేనెంబర్ 366/3లో కొంత భూమి ఉంది. దీని విషయమై మా సరిహద్దు రైతులతో 2007 నుంచి ఇప్పటివరకు అద్దంకి కోర్టులో వివాదం నడుస్తోంది. భూమి మా ఆధీనంలోనే ఉండేది. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వేలో భూమి మా పూర్వీకుల ఆస్తిగా మా పేరిట ఆన్‌లైన్ అయింది. ఎల్పీఎం నంబరు సైతం వచ్చింది. ఈ సంవత్సరం జూన్ నెలలో అప్పటి మార్టూరు సీఐ శేషగిరి నన్ను, మా అన్నయ్యను పోలీస్ స్టేషనుకు పిలిపించి బెదిరించారు. తహసీల్దార్ ప్రశాంతి ఏకపక్షంగా అవతల వారి వద్ద డబ్బు తీసుకొని నా భూమిని వారి పేరుతో ఆన్లైన్ చేసి వారికి అప్పగించారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రశాంతి, సీఐ శేషగిరిపై గత సెప్టెంబరు 26వ తేదీన హైకోర్టులో విడివిడిగా ప్రైవేట్ కేసులు వేశాను. కలెక్టర్ విచారించి న్యాయం చేయాలి.
– బెల్లంకొండ జానకీరామయ్య, ద్రోణాదుల
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు


