క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే సర్వాంగసుందరంగా ముస్తాబైన ప్రముఖ చర్చిలు ప్రత్యేక ప్రార్థనలతో ఏసుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు
సత్తెనపల్లి: క్రీస్తు అనగానే క్షమ, కరుణ గుణాలు గుర్తుకు వస్తాయి. లోకంలోని పాపులను పరిశుద్ధులు చేసేందుకు, వారికి క్షమను అందించేందుకు కరుణామయుడైన ఏసుక్రీస్తు.. శిలువపై తన ప్రాణాలను బలిపెట్టిన రోజే గుడ్ ఫ్రైడే. దీనినే శుభ శుక్రవారం అని కూడా అంటారు. తన ఆత్మ బలిదానంతో పాపులకు దేవుని పరిశుద్ధ సన్నిధిలో స్థానం కల్పించిన ఈ శుక్రవారాన్ని ప్రపంచంలోని క్రైస్తవులందరూ శుభ శుక్రవారంగా భావిస్తారు. దయామయుడైన క్రీస్తు శిలువపై చిందించిన రక్తం మానవాళికి శుభాలను చేకూర్చింది. అందువల్ల క్రైస్తవులు, విశ్వాసులు గుడ్‌ఫ్రైడేని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. గుడ్ ఫ్రైడే నాడే కల్వరిగిరిపై క్రీస్తును శిలువపై శిక్షించారు.
చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు
జిల్లాలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవులు, విశ్వాసులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగా పాస్టర్లు చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు చేయనున్నారు. ఏసుప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించి ఆరాధించే వారికి పరలోక ద్వారాలు తెరుచుకొని ఉంటాయని విశ్వాసుల ప్రగాఢ నమ్మకం. ఏసు మరణం సృష్టిలో ఓ అద్భుతమైన త్యాగపూరిత మరణం. దేవునితో మానవునికి శాశ్వత బంధాన్ని ఏర్పరిచిన గొప్ప మరణం.
రేపటితో ముగియనున్న లెంట్ డేస్..
గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని క్రైస్తవులు, విశ్వాసులు 40 రోజులపాటు లెంట్‌డేస్ (శోక దినాలు) నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన లెంట్ డేస్ శనివారంతో ముగియనున్నాయి. లెంట్ డేస్ సందర్భంగా క్రైస్తవులు 40 రోజులు శుభ కార్యాలకు దూరంగా ఉంటారు. నిరంతరం దైవధ్యానంలోనే గడుపుతారు. పొరపాటున కూడా చెడు వ్యాపకాల వైపు మనసు మరల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లెంట్‌డేస్ సందర్భంగా చర్చిల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా మౌనంగా ప్రార్థనలు నిర్వహిస్తారు. శుక్రవారం గుడ్ ఫ్రైడేని, ఆదివారం ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు, విశ్వాసులు ఘనంగా నిర్వహించుకోనున్నారు.
పునరుత్థానమే ఈస్టర్
కల్వరి కొండ మీద శిలువపై మరణించిన క్రీస్తును .. అక్కడి కొండ గుహలో సమాధి చేస్తారు. మూడవ రోజు ఏసుక్రీస్తు పునరుత్థానం పొంది తిరిగి తన శిష్యులకు దర్శనమిచ్చారు. ‘నేను జీవమును’ అనే మాటకు నిదర్శనంగా నిలిచి లోకానికి తన దివ్య మహిమను చాటారు. ప్రభువు పునరుత్థానం చెందిన ఆదివారాన్ని ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. అశాంతితో తల్లడిల్లుతున్న నేటి ప్రపంచానికి క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ, క్షమ గుణాలు ఆదర్శం కావాలని పాస్టర్లు చెబుతున్నారు. జిల్లాలో పలు చర్చిల్లో క్రీస్తు ఆత్మ బలిదానం, శిలువ యాగం తదితర ఘట్టాలను ప్రదర్శించనున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఏసు ప్రభువు కల్వరి కొండపై బలిదానం చేసిన ఘట్టాలను క్రైస్తవులు, విశ్వాసులకు పాస్టర్లు తెలియజేయనున్నారు.


