ట్రాలీ ఆటో ఢీకొని ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాలీ ఆటో ఢీకొని ఇద్దరు మృతి

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

వరుస ప్రమాదాలతో బెంబేలు..

చీరాల: చీరాల మండలం విజయనగర్‌కాలనీ సమీపంలోని వాడరేవు– పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యక్తులను వేగంగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.

అందిన వివరాల మేరకు... చీరాల మండలం విజయనగర్‌ కాలనీకి చెందిన తేళ్ల పెద్ద లక్ష్మయ్య (68), రేణుమాల సుబ్బయ్య (60), చుండూరి వీరయ్యలు గురువారం ఉదయం పొలానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బాపట్లకు చెందిన గోపీ అనే ఆటోడ్రైవర్‌ చిలకలూరిపేటలో మిరపకాయల లోడు దింపి పర్చూరు నుంచి చీరాల వైపు వస్తున్నాడు. రోడ్డుపై వెళుతున్న ముగ్గురిపైకి ఆటో దూసుకెళ్లడంతో తేళ్ల పెద్ద లక్ష్మయ్య, రేణుమాల సుబ్బయ్య తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. చుండూరి వీరయ్యకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తేళ్ల పెద్ద లక్ష్మయ్య సోషల్‌ వెల్ఫేర్‌ శాఖలో విశ్రాంత ఉద్యోగి కాగా, రేణుమాల సుబ్బయ్య హైవే అథారిటీలో ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో విజయనగర్‌ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అధికారులు సరైన హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement