వదలని బెట్టింగ్‌ భూతం! | - | Sakshi
Sakshi News home page

వదలని బెట్టింగ్‌ భూతం!

Dec 29 2025 7:58 AM | Updated on Dec 29 2025 7:58 AM

వదలని

వదలని బెట్టింగ్‌ భూతం!

వదలని బెట్టింగ్‌ భూతం!

క్రికెట్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసలుగా యువత, వ్యాపారులు విద్యార్థులకు సైతం వ్యసనం మారిన పందేలు బంగారంలాంటి భవిష్యత్తు సర్వ నాశనం చీరాల కేంద్రంగా పెద్ద ఎత్తున బుకీ ఏజెంట్ల కార్యకలాపాలు

చీరాల టౌన్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు చీరాల్లో అధికంగా ఉన్నాయి. చివరకు ఇంజినీరింగ్‌, డిగ్రీ చదివే విద్యార్థులు సైతం ఇళ్లలో నుంచి తెచ్చుకున్న డబ్బులతో బెట్టింగ్‌లు పెడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చీరాల్లో రూ.కోట్లలో బెట్టింగ్‌ కారణంగా చేతులు మారుతున్నాయి. ఇందుకు వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బుకీలుగా ఏజెంట్లు కథ నడుపుతున్నారు. గతంలో ఒకే చోట కూర్చొని బెట్టింగ్‌లు జరుగుతుంటే పోలీసులు నిఘా పెట్టి పట్టుకునేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. బెట్టింగ్‌ బాబులు రూటు మార్చారు. ప్రస్తుతం బిగ్‌బ్యాస్‌, బెట్‌ 365 అనే ఆన్‌లైన్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి టీవీలో ఒక బంతి కంటే ముందుగానే వచ్చే సమాచారాన్ని చూస్తూ ఫోన్ల ద్వారానే బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘాకు అందకుండా ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు బెట్టింగ్‌ రాయుళ్లతో పందేలు కాయిస్తున్నారు. సులువుగా సంపాదించుకునే ఉద్దేశంతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు ఈ బెట్టింగ్‌కు బానిసలై చితికిపోతున్నారు. యువకులు, బంగారు వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు రూ.లక్షలు బుకీల ద్వారా పందేలు కాస్తున్నారు. కంప్యూటర్‌తోపాటు ఫోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు బుకీల ద్వారా సమాచారం తెలుసుకుని స్థానికంగా బెట్టింగ్‌లు వేస్తున్నారు. వీరంతా బుకీలకు ఏజెంట్లుగా, చిన్న బుకీలుగా వ్యవహరిస్తున్నారు. నమ్మకంగా ఉంటూ పందేలు కాసేవారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. చీరాల్లో 10 మందికి పైగా బుకీలు ఏజెంట్లున్నారు. జాండ్రపేటలో ఇద్దరు, వేటపాలెంలో ఇద్దరు, ఈపూరుపాలెంలో ఇద్దరు ఏజెంట్లు చీరాల ప్రాంతంలో జరిగే బెట్టింగ్‌లను నడుపుతున్నారు. నగదు లావాదేవీలంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఫలితాన్ని బట్టి డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకం లేని వారి వద్ద ముందే డబ్బు డిపాజిట్‌ చేసుకుంటున్నారు.

గ్రామాలలో సైతం

నిన్నమొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్‌ భూతం నేడు గ్రామాలకు కూడా పాకింది. అక్కడా బుకీ ఏజెంట్లు ఏర్పడ్డారు. బెట్టింగ్‌కు అలవాటు పడిన కొందరు బుకీ ఏజెంట్లు గ్రామస్తుల నుంచి డబ్బులు, స్థిరాస్తులను సైతం వాటిపై బెట్టింగ్‌ కాస్తున్నారు. ముఖ్యంగా కారంచేడు, ఇంకొల్లు, పర్చూరుతోపాటు చీరాల్లో కూడా పలు గ్రామాల్లో ఈ బెట్టింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. చీరాల పట్టణంలో ముంతావారి సెంటర్‌, కొట్లబజారు, పేరాల సెంటర్‌, ఈపూరుపాలెం తదితర ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

కుటుంబాలు నాశనం

చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్న, మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటే, మరికొందరు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులు వడ్డీ సహా పేరుకుపోయి అవి తిరిగి చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఎక్కువగా యువకులు, విద్యార్థులు, వ్యాపారులే బలైపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చాప కిందనీరు ఉన్న బెట్టింగ్‌ భూతాన్ని పోలీసులు ఇకనైనా నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఐపీఎల్‌, ఇతర క్రికెట్‌ పోటీలను చూసి కొందరు ఆనందిస్తుంటే చాలామంది బెట్టింగ్‌ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్‌ భూతం కారణంగా చాలా కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. సామాన్యులు కోలుకోలేని అప్పుల బాధతో ప్రాణాలు తీసుకుంటున్నారు.

వదలని బెట్టింగ్‌ భూతం!1
1/1

వదలని బెట్టింగ్‌ భూతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement