చిలకలూరిపేటటౌన్: ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయటానికి వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. రాజాపేట గురుకుల పాఠశాలలో పనిచేయటానికి పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ ఇంగ్లిషు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు ఎమ్మెస్సీ బీఈడీ , ఎంఏ బీఈడీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సర్టిఫికెట్ జిరాక్సు కాపీలతో స్కూల్ ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని కోరారు. పురుష అభ్యర్థులకు ప్రాధాన్యంఉంటుందని తెలిపారు.
నేడు చిన్నగంజాంలో
జగనన్నకు చెబుదాం
బాపట్ల: జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమం మండల కేంద్రం చిన్నగంజాంలో బుధవారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలియజేశారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చిన్నగంజాంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో జరుగుతుందన్నారు. మండలంలోని ప్రజలందరూ వినియోగించుకోవలసిందిగా కలెక్టర్ తెలిపారు.
ఓటు హక్కు కోసం యువత ముందుకు రావాలి
గుంటూరు జాయింట్ కలెక్టర్ రాజకుమారి
గుంటూరు వెస్ట్ : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లోని యువత ఓటు హక్కు నమోదుకు ముందుకు రావాలని, అధికారులు దీనిపై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరం నుంచి నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్–2024లో భాగంగా జిల్లాలోని స్వీప్ నోడల్ అధికారులు, ఈఆర్వో, ఏఈఆర్వోలు విద్యాలయాలకు వెళ్లి సిబ్బందితో, విద్యార్థులతో సమావేశం నిర్వహించాలన్నారు. యువతను తప్పకుండా ఓటరుగా చేర్పించే విధంగా కృషి చేయాలన్నారు. దీనికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాలన్నారు. జనవరి 1, 2024న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారని పేర్కొన్నారు.
సమగ్ర శిక్షలో ఏపీఓ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు జిల్లా సమగ్రశిక్షలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ (ఏపీవో)గా ఫారెన్ సర్వీసు నిబంధనలు అనుసరించి, డెప్యూటేషన్‌పై పని చేసేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు డిసెంబర్ 4వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 నాటికి 50 ఏళ్లలోపు వయసు కలిగిన మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో పీజీలో ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణతతో పాటు ఎంసీఏ, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అర్హతలు గల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్, ఇతర ధ్రువపత్రాలపై సంబంధిత అధికారి సంతకంతో డీఈవో కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో అందజేయాలని సూచించారు. గతంలో సమగ్రశిక్షలో మూడేళ్లపాటు పని చేసిన పక్షంలో తిరిగి దరఖాస్తు చేసేందుకు ఆర్నెల్లు పీరియడ్ పైబడి ఉండాలని స్పష్టం చేశారు. వివరాలకు సమగ్రశిక్ష కార్యాలయంతోపాటు సమగ్రశిక్ష గుంటూరు.బ్లాగ్‌స్పాట్.కామ్ సైట్ సందర్శించాలని తెలిపారు.
12 మందికి ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: గుంటూరు రేంజ్‌లో 12 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. ఏఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్న టి.మోహనరావు, జీసీఎం.దాస్, (ఎస్‌పీఎస్ నెల్లూరుజిల్లా), ఎం.పోలురాజు, జి.మురళీధర్‌రావు, ఎస్.మరియదాస్, (ప్రకాశం జిల్లా), ఇ.శ్రీనివాసరావు, జి.మీరావలి, పి.శ్యామలాదేవి, ఎం.బ్రహ్మయ్య (గుంటూరు రూరల్), ఎన్.రవికుమార్, టి.నరేంద్రకుమార్ (గుంటూరు జిల్లా), హెడ్‌కానిస్టేబుల్ (హెచ్‌సీ) పి.శ్రీనివాస రావు (ప్రకాశం జిల్లా) ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయల కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.2,900, మోడల్ ధర రూ.2,400 వరకు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment