
మార్టూరు: అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తుల గురించి ప్రకటించడం ద్వారా ప్రజలకు ఏం సంకేతాలు పంపదల్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు. శుక్రవారం కోనంకి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో ఏ మాత్రం ప్రాతినిధ్యం లేని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, 40 ఏళ్లు ఇండస్ట్రీ చెప్పుకునే చంద్రబాబుతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం ప్రజలకేమీ కొత్తగా అనిపించలేదన్నారు.
ఈ అపవిత్ర పొత్తు గురించి సామాన్యుడు సైతం ఊహించిందేనని ఆమంచి అన్నారు. తనకు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని సమూలంగా మార్చివేస్తాననే పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటన గురించి తమ పార్టీ కేడర్‌తో మాట మాత్రం ప్రస్తావించక పోవడాన్ని ఆమంచి ఎద్దేవా చేశారు. ఓ కమ్యూనిటీ బలంతో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ వారికి ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
చంద్రబాబుపై మోపబడిన నేరాలు, అభియోగాలు పవన్ కళ్యాణ్‌కు కనిపించక పోవటం ఆశ్చర్యంగా లేదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందే కానీ ఎవరి ప్రోద్బలం లేదన్నారు. పొత్తులతో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహనరెడ్డి గెలుపును ఆపడం ఎవరి తరం కాదని ఆమంచి ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో డెయిరీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య, బొబ్బేపల్లి సొసైటీ చైర్మన్ ఉప్పల అనిల్, మార్టూరు మండల ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ, కోనంకి సర్పంచ్ జొన్నలగడ్డ రేణుక, పర్చూరు మాజీ ఏఎంసీ చైర్మన్ జువ్వా శివరామప్రసాద్, భుక్యా బాబునాయక్, జీ రవిచంద్, అట్లూరి సుకుందరావు, మండల కన్వీనర్ పఠాన్ కాలేషావలి, గడ్డం మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.