
కోవిడ్–19.. ఈ పేరు వింటేనే చాలా మంది చిగురుటాకుల్లా వణ
చీరాల రూరల్: కోవిడ్‌తో వేలాది మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న సమయంలో నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీశాలిగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన రూ.కోట్లు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి లక్షలాదిమంది ప్రాణాలను కాపాడారు. ఇలా చీరాల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో రూ.కోటిపైగా వెచ్చించి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ ప్లాంటుకు అనుసంధానంగా ఆస్పత్రి ప్రాంగణంలోనే భారీసైజులో టెంట్లు వేసి.. అదనంగా బెడ్లువేసి నిరంతరాయంగా ఆక్సిజన్‌ను సరఫరా చేయించిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే.
మళ్లీ మహమ్మారి విజృంభణ!
ప్రస్తుతం కొన్ని దేశాల్లో కోవిడ్ విజృంభిస్తోంది. ఆయా దేశాల్లో మాస్కులు, శానిటైజర్లు వంటివి వాడుతూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దేశంలోని కేరళ, మహారాష్ట్రలో కూడా ఇప్పటివరకు 270కి పైగా కేసులు నమోదయ్యాయి. విశాఖలో కూడా కేసులు వెలుగుచూస్తుండటం గమనార్హం. ఈ తరుణంలో చీరాల ప్రభుత్వాసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంటు ఏడాదిన్నరగా మూలన పడడం స్థానికులను కలవర పరుస్తోంది.
ఫొటో తీసేస్తే సరిపోతుందా?
టెక్నీషియన్ లేడన్న సాకుతో ఆస్పత్రి నిర్వాహకులు రూ.కోటిపైగా వెచ్చించి నిర్మించిన ఆక్సిజన్ ప్లాంటుకు తాళాలేసి మూలనపెట్టారు. అంతేకాక సెన్సార్ పనిచేయడంలేదని, కంప్రెషర్ పనిచేయడంలేదని సిబ్బంది చెబుతున్నారు. మరికొద్దికాలం గడిస్తే ప్లాంటులోని ముఖ్యమైన పరికరాలు ఎందుకు పనికిరాకుండా పాడై పోతాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్లాంటుపై ఉన్న నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను, ఆయన పేరును మాత్రం తొలగించడంతో సరిపెట్టారు కానీ.. మరమ్మతులు చేయలేదు.
అత్యవసర సమయాల్లో ఎలా?
ఆక్సిజన్ ఒక్క కోవిడ్ రోగులకే కాకుండా, తల్లీ బిడ్డల వార్డుల్లో చేరిన గర్భిణులు, గాయాలపాలై ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులకు, పురుగుమందులు తాగిన వారు, ఆపరేషన్‌లు చేయించుకునే రోగులు, ఆస్తమా పేషెంట్లు, హైరిస్క్ పేషెంట్లకు కూడా అవసరమవుతుంది. 108 అంబులెన్స్‌లో తప్పనిసరి. ఈ క్రమంలో ప్రభుత్వాసుపత్రిలో నెలకు సరాసరి ఏడు నుంచి పది వరకు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఒకవేళ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేస్తే సిలిండర్లు కొనే అవసరం ఉండదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత అధికంగా ఉన్నట్లు రోగులు చెబుతున్నారు.
చీరాల ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌కు మరమ్మతులు కోవిడ్ సమయంలో రూ.1.06 కోట్లతో ఏర్పాటు చేసిన నాటి సీఎం జగన్ టెక్నీషియన్ లేడన్న సాకుతో నేడు ప్లాంటుకు తాళం తుప్పుపట్టిపోతున్న జనరేటర్, పరికరాలు మళ్లీ కోవిడ్ భయాల నేపథ్యంలో మరమ్మతులు చేయాలంటున్న ప్రజలు
ఉన్నతాధికారులకు నివేదించాం
ఆక్సిజన్ ప్లాంటు మరమ్మతులకు గురైన విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. కొద్ది రోజుల్లోనే మరమ్మతులు చేయించి రోగులకు అందుబాటులోకి తీసుకువస్తాం. ప్లాంటుకు ప్రత్యేకంగా టెక్నీషియన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోగులకు ఆక్సిజన్ కొరతలేకుండా కాన్సన్‌ట్రేషన్లు పెడుతున్నాం.
– డాక్టర్ శ్రీకాంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్

కోవిడ్–19.. ఈ పేరు వింటేనే చాలా మంది చిగురుటాకుల్లా వణ