
ఉచిత న్యాయ సహాయం పొందండి
నరసరావుపేటటౌన్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు మండల న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్యశ్రీ అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురయితే జాతీయ న్యాయసేవాధికార సంస్థ ప్రవేశ పెట్టిన హెల్ప్‌లైన్ నెం. 15100కు ఫిర్యాదు చేయాలన్నారు. అదే విధంగా జాతీయ మహిళా హెల్ప్‌లైన్ 7827170170 నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. లైంగిక వేధింపుల చట్టం గురించి అవగాహన కల్పించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
31న జెడ్పీస్థాయీ సంఘ సమావేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 31న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, అభివృద్ధి పనులకు సంబంధించిన 1, 2, 4, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్నాయి. వ్యవసాయంపై 3వ స్థాయి సంఘం జెడ్పీ వైస్ చైర్మన్ శొంటిరెడ్డి నర్సిరెడ్డి, సీ్త్ర–శిశు సంక్షేమంపై 5వ స్థాయీ సంఘం తెనాలి జెడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి, సాంఘిక సంక్షేమంపై 6వ స్థాయీ సంఘం జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ బత్తుల అనురాధ అధ్యక్షతన జరగనున్నాయి. స్థాయీ సంఘ సమావేశాలకు ఆయా సంఘాల సభ్యులతో పాటు మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని సీఈవో జ్యోతిబసు సూచించారు.
యోగాంధ్రపై విస్తృత ప్రచారం
నరసరావుపేట: యోగాంధ్రలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధికారులకు సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జూన్ 21 వరకు యోగా ప్రాముఖ్యతను విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులకు, ఆయా రంగాల్లోని వారికి వివిధ పోటీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో యోగా శిక్షకులను గుర్తించి అభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో యోగా అభ్యాసకులకు ప్రజలను నమోదుచేసేందుకు కృషిచేయాలన్నారు. ప్రతిరోజూ నరసరావుపేటతో పాటు మున్సిపాల్టీలు, మండలస్థాయిలో యోగా ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. డీఆర్‌ఓ ఏకా మురళి పాల్గొన్నారు.
పిల్లలకు ఎంఆర్ వ్యాక్సిన్ వేయించండి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి
నరసరావుపేట: జిల్లాలో పిల్లలకు ఆటలమ్మ, రూబెల్లా వ్యాధులు సంక్రమించకుండా ఎంఆర్ వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలను సంప్రదించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి కోరారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలో మీజిల్స్ రుబెల్లా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మూడు విడతలుగా ప్రత్యేక ఎంఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 31వరకు, జూన్ 23 నుంచి 28వరకు, జూలై నెలలో 21 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ మొదటి డోసు తొమ్మది నుంచి 12 నెలల మధ్య, రెండో డోసు 16 నెలల నుంచి 24 నెలల మధ్య వేయాలని పిల్లలకు వేయించాలని కోరారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎంఆర్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసులు వేయించుకోని పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తారన్నారు.

ఉచిత న్యాయ సహాయం పొందండి