
రాజకీయ కుట్రతోనే రేషన్ వాహనాలు రద్దు
బాపట్లటౌన్: రాజకీయ కుట్రతోనే కూటమి సర్కార్ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాలను రద్దుచేసిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మజుందార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సోమవారం జిల్లాలోని ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్లు, ఎండీయూ వాహనాలతో పట్ణణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేసినప్పటికీ ఎండీయూ వాహనాల ఆపరేటర్లు ముందుకు సాగించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనికి వాహనాలను అనుమతించకపోవడంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను నిలుపుదల చేసి ఆపరేటర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్లకు సంఘీభావంగా సీఐటీయూ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మజుందార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం వాటిని నిలుపుదల చేయటం సమంజసం కాదన్నారు. వాహనాలను నిలుపుదల చేయటం వలన జిల్లాలో 18,520 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఈ విధానాన్ని కొనసాగించాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల పట్టణ నాయకులు కే శరత్, ఎండీయూ వాహనాల జిల్లా నాయకులు ధార దేవసహాయం, గోపి, పేర్ని రమేష్, మేకల రాజేష్, రాఘవ పాల్గొన్నారు.
ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఎండీయూ వాహనదారుల ఆందోళన ఎండీయూ వాహనాలతో బాపట్లలో భారీ ర్యాలీ అడ్డుకునేందుకు పోలీసుల యత్నం ఎట్టకేలకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

రాజకీయ కుట్రతోనే రేషన్ వాహనాలు రద్దు