
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల: పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ 177 అర్జీలు స్వీకరించారు. తన పరిధిలో ఉన్న వాటికి ఆయన తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలన చేశారు. మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. అర్జీల పరిష్కారంపై ప్రజల సంతృప్తిస్థాయి పెరిగేలా అధికారులు పనిచేయాలని చెప్పారు. అధికారులు నిర్లిప్తంగా ఉండరాదన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 22 క్యాటగిరీలో పెండింగ్‌లో ఉన్న 108 అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆర్డీవోలకు సూచించారు. సాధారణ బదిలీల్లో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు. బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయరాదన్నారు. ఆ స్థానంలో పొరుగు జిల్లాల నుంచి అదే హోదాలో వచ్చే వారు ఉంటేనే అనుమతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి