విద్యాశాఖ బదిలీలలు | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ బదిలీలలు

May 27 2025 1:58 AM | Updated on May 27 2025 1:58 AM

విద్య

విద్యాశాఖ బదిలీలలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: బదిలీలకు తెరలేచిందనే ఆనందం ఉపాధ్యాయుల్లో ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే బదిలీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో కోరుకున్న పాఠశాలకు వెళ్లడం గగనమవుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతున్నామంటూనే మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో విధించిన నిబంధనలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగియనుంది. ఇందుకు సంబంధించి జీఓ 22 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. పుట్టుకతో శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ ద్వారా వారు కోరుకున్న పాఠశాలకు వెళ్లే సదుపాయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శారీరక వైకల్యం 70శాతం లోపు ఉంటే ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు, 70 శాతానికి పైగా ఉంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రిఫరెన్షి యల్‌ కేటగిరీలో సంబంధిత ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లవచ్చు. గత 25 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని మార్చివేసి ఎస్జీటీలకు 40 శాతం, స్కూల్‌ అసిస్టెంట్లకు 50 శాతం సీలింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

కక్షపూరితంగానే..!

శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఒకే పాఠశాలలు ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్‌–2 హెచ్‌ఎం, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి.

● ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకరు లేక ఇద్దరు ఎస్జీటీలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాంగ్‌ స్టాండింగ్‌ విధానంలో బదిలీపై వెళ్లేందుకు పీహెచ్‌ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం లేదు. ముగ్గురి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉంటేనే సదరు పాఠశాలలను కోరుకోవాలని లేకుంటే మరో పాఠశాలకు వెళ్లాలంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం, సీలింగ్‌ పరిధికి మించిన పాఠశాలలను బ్లాక్‌ చేసింది.

● పుట్టుకతో అంధత్వం, వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో తాము పని చేస్తున్న పాఠశాలల్లోనే బదిలీ కాకుండా ఉండటంతో పాటు కోరుకున్న చోటకు బదిలీపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం లేకుండా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీకి ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది.

● శారీరక వైకల్యంతోపాటు దీర్ఘకాలిక జబ్బులు, కేన్సర్‌, గుండె జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు హైస్కూళ్లలో సింగిల్‌ సబ్జెక్టు టీచర్లుగా బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. అంధ, వినికిడి లోపం, నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు విధించారు. ప్రతి మండలంలో 15 వరకు ఖాళీలు ఉండగా, వాటిలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే కోరుకునే విధంగా ఉంచి, మిగిలిన వాటిని బ్లాక్‌ చేశారు.

● దూరప్రాంతాల్లో మగ్గుతూ వైద్య సదుపాయాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతు న్న టీచర్లకు మొండిచెయ్యి చూపారు. భర్త చనిపోయిన మహిళా ఉపాధ్యాయులకు విడాకులు తీసుకున్న ఉపాధ్యాయినులకు సైతం నిరాశే ఎదురవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం అన్యాయానికి గురవుతున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

ఆర్థికంగా భారం లేని బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలతో జరిపిన చర్చలకు, మార్గదర్శకాలకు పొంతన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

బదిలీలకు అవకాశం.. కఠిన నిబంధనలతో మెకాలొడ్డి..

శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం కరవు 25 ఏళ్లుగా అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్‌ కేటగిరీపై ఆంక్షలు ఉపాధ్యాయ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాఖలైన దరఖాస్తులు 6,870 లాంగ్‌ స్టాండింగ్‌లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్‌ఎంలు, టీచర్లు 4,143 మంది

ఉమ్మడి జిల్లాలో 6,870 దరఖాస్తులు

ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగియనుండగా, సోమవారం నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,870 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు దరఖాస్తు చేశారు. వీరిలో లాంగ్‌ స్టాండింగ్‌లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్‌ఎంలు, టీచర్లు 4,143 మంది ఉన్నారు.

మానవత్వం లేకుండా మార్గదర్శకాలు

బదిలీల మార్గదర్శకాల్లో విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించారు. పీహెచ్‌ కేటగిరీతోపాటు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ పాఠశాలల్లో ఖాళీలను బ్లాక్‌ చేశారు. శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీడబ్ల్యూడీ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందిన వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సినదిపోయి ఈ విధంగా కఠిన నిబంధనలు విధించడం దుర్మార్గం. – కె.బసవలింగారావు, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్‌

వైకల్యంతో పుట్టడం మా తప్పా ?

నేను గుంటూరు రూరల్‌ ఓబులనాయుడుపాలెంలోని ఎంపీయూపీఎస్‌లో పని చేస్తున్నాను. 70 శాతానికి పైగా శారీరక వైకల్యానికి గురైన నేను బదిలీల్లో గుంటూరుకు సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. ఉపాధ్యాయ బదిలీల చట్టంలో లేని విధంగా జీఓలో అనేక కఠిన నిబంధనలు విధించారు. శారీరక వైకల్యంతో జన్మించడం నా తప్పిదమా ? మానవత్వాన్ని చూపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఈ విధంగా నిబంధలు విధించి పీహెచ్‌ కేటగిరీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు.

– పి.నాగశివన్నారాయణ, ఎస్జీటీ, గుంటూరు

విద్యాశాఖ బదిలీలలు1
1/2

విద్యాశాఖ బదిలీలలు

విద్యాశాఖ బదిలీలలు2
2/2

విద్యాశాఖ బదిలీలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement