
నల్లబర్లీ కొనుగోలు చేయిస్తాం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
మార్టూరు: నల్లబర్లీ పొగాకు సాగు చేసి కొనుగోలు జరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా ఉంటామని పొగాకు కంపెనీలచే రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. స్థానిక ఇసుక దర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో శనివారం నల్ల బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు, పొగాకు కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ కె.వెంకట మురళి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, పొగాకు బోర్డు, కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మంత్రుల పర్యటన సాగిందిలా...
మొదట యద్దనపూడి మండలం సూరవరపు పల్లె గ్రామ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద నిల్వచేసి ఉన్న నల్ల బర్లీ పొగాకును మంత్రి అచ్చెన్నాయుడు బృందం పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకుంది. అనంతరం మార్టూరులోని మద్ది లక్ష్మయ్య ఆగ్రో ప్రోడక్ట్ (ఎంఎల్‌ఏపీ) పొగాకు కంపెనీని పరిశీలించి పొగాకును ప్రాసెసింగ్ చేసే విధానాన్ని పరిశీలించి సంస్థ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఇసుక దర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మాట్లాడారు. నల్ల బర్లీ పొగాకును గత సంవత్సరం కొనుగోలు చేసినట్లే కంపెనీలు ఈ సంవత్సరం కూడా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయించి రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం నల్ల బర్లీ పొగాకు మొత్తం 80 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగిందని కంపెనీలు మొత్తం కొనుగోలు చేయవలసిందేనన్నారు. కంపెనీలు కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలన్నారు. ప్రాసెసింగ్ కోసం అయ్యే ఖర్చు రూ.150 కోట్లు ముఖ్యమంత్రితో మాట్లాడి కంపెనీలకు ఇప్పిస్తానని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పొగాకును రెండు గ్రేడులుగా విభజించి నాణ్యత కలిగిన పొగాకు క్వింటా రూ.12 వేలకు, రెండో రకం రూ.5వేల నుంచి 6వేలకు తగ్గకుండా శనివారం నుంచి కొనుగోలు చేయాలని మంత్రి అన్నారు.