టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా ఇష్టపడే వస్తున్నారా?

- - Sakshi

సత్తెనపల్లి: సత్తెనపల్లి టీడీపీలో ముసలం మరింత ముదరనుందా? ఇప్పటి వరకు సీటు తమదంటే తమదంటూ పావులు కదిపిన నేతలు.. ఇకపై తమ అసమ్మతి గళం వినిపించనున్నారా ? ఇప్పటికే ప్రజల్లో మెండైన సానుకూలతతో వైఎస్సార్‌ సీపీ బలంగా ఉంది. టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణ ఇష్టపడే వస్తున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లోనా! అనేది స్పష్టత కొరవడింది. పెదకూరపాడు కాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కానీ కన్నా ఆశించారనేది సన్నిహితుల మాట. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.

ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్‌ సీపీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళుతోంది. అదే సమయంలో మహానాడు ద్వారా పార్టీకి ఉత్సాహాన్ని తీసుకొద్దామనుకున్న చంద్రబాబు.. కాపీ మేనిఫెస్టోతో బొక్కబోర్లా పడ్డారు. ఈ క్రమంలో పార్టీలో చేరిన మూడు నెలల తర్వాత సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మార్పుపై పార్టీలో భిన్నమైన టాక్‌ వినిపిస్తోంది.

నాలుగు స్తంభాలాట
గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయన అకాల మరణంతో ఇన్‌చార్జి బాధ్యతలను అధిష్టానం ఎవరికీ అప్పగించలేదు. కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి), మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో మూడు గ్రూపులుగా విడిపోయారు. ఈ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నట్టు ఆ పార్టీ అధిష్టానం తాజాగా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివరామ్‌, మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆందోళనలో ఉన్నారు. దీనివల్ల గ్రూపు విభేదాలు, అసంతృప్తులు మరింత పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కన్నాకు కాపు కాసేది లేదు...
తొలి నుంచి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989, 1994, 1999, 2004లలో పెదకూరపాడు నుంచి గెలిచారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో కన్నా గురి కూడా పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలపైనే ఉందని ఆయన సన్నిహితుల మాట. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అంబటి రాంబాబు తొలి నుంచి కాపులతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలుస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి ఓటమిపాలైన నిమ్మకాయల రాజనారాయణ యాదవ్‌, ఆయనపై గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి (2004లోనూ గెలుపొందారు), కాపు సంఘ నేత పక్కాల సూరిబాబు వైఎస్సార్‌ సీపీలో చేరడంతో అధికారపార్టీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా ఉండేందుకు కన్నా కూడా విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సత్తెనపల్లిలో టీడీపీకి నాలుగో కృష్ణుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇన్‌చార్జిగా బాధ్యతల అప్పగింత ఇప్పటికే వర్గపోరు పార్టీ శ్రేణుల్లో నిస్తేజం తాజాగా నాలుగు స్తంభాలాటకు అధిష్టానం ఆజ్యం కన్నాకు సత్తెనపల్లికి రావడం ఇష్టం లేదని టాక్‌

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top