సాగరమిత్రలు!

- - Sakshi

శనివారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2023
కడలిపుత్రుల తోడుగా..
● తీరప్రాంతాల్లో సాగరమిత్రల నియామకం ● నూతనంగా 23 పోస్టులు మంజూరు ● డిగ్రీ అర్హతగా నియామకానికి కసరత్తు ● రెండు రోజులుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ● మత్స్యకారుల అభ్యున్నతి కోసం పనిచేయనున్న సాగరమిత్రలు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలోని సముద్రతీరంలో సాగరమిత్రల నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మత్స్యకారులకు మార్గనిర్ధేశకులుగా సాగరమిత్రలు పనిచేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వీరిని నియమిస్తోంది. వీరు ఐదేళ్ల పాటు విధుల్లో ఉంటారు. సముద్రతీర ప్రాంతాలైన వేటపాలెం, చీరాల, చినగంజాం, బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలోని 47 ల్యాండింగ్‌ సెంటర్ల పరిధిలో సాగరమిత్రలను నియమిస్తారు. డిగ్రీ అర్హతగా వీరి నియామకం జరుగుతుంది. మత్స్యకార గ్రామాల పరిధిలోని నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2019–20లో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పట్లో తీర ప్రాంతానికి చెందిన 17 మంది సాగరమిత్రలను నియమించారు. నెలకు రూ.15 వేలు జీతం ఇస్తున్నారు. తొలుత పదిహేడు మందిని నియమించగా వీరిలో ఇద్దరు ఉద్యోగం మానివేశారు. 15 మంది ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నారు.

కొత్తగా మరో 23 మంది సాగరమిత్రలు..

కొత్తగా ఈ పథకం కింద ప్రభుత్వం 23 మందిని సాగరమిత్రలుగా నియమించాలని నిర్ణయించింది. దీనిపై ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో జిల్లాలోని తీరప్రాంత మండలాల పరిధిలో డిగ్రీ చదివిన 132 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 94 మంది అర్హత సాధించారు. శుక్ర, శనివారం జిల్లా కేంద్రంలోని మత్స్యశాఖ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతోంది. ప్రక్రియ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. వీరిలో 23 మందిని సాగరమిత్రలుగా నియమించనున్నారు.

సాగరమిత్రల విధులు ఇలా..

జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 74 కిలోమీటర్ల మేరా తీరప్రాంతం ఉంది. 57 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 53,515 మంది మత్స్యకారులు ఉండగా, 14,387 మంది యాక్టివ్‌ మత్స్యకారులుగా ఉన్నారు. 3099 బోట్లు ఉన్నాయి. సాగరమిత్రలు సముద్రంలో వేటసాగించే మత్స్యకారులకు మార్గనిర్ధేశకులుగా విధులు నిర్వహిస్తారు. ప్రతి రోజు సముద్రంలోకి వెళ్లే బోట్లు, వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్యతో పాటు తిరిగివచ్చే బోట్లు, మత్స్యకారుల వివరాలను ఎప్పటికప్పుడు లాక్‌బుక్‌లో నమోదు చేస్తారు. వేటలోపడే చేపల రకాలను గుర్తించి తద్వారా మత్స్య సంపద వివరాలను నమోదు చేస్తారు. మత్స్యకారులు వేట సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలను వివరిస్తారు. ప్రభుత్వపరంగా మత్స్యకారులకు అందాల్సిన పథకాలను వివరించడంతో పాటు వారు వాటిని పొందేలా చర్యలు చేపడతారు. మొత్తంగా సాగరమిత్రలు మత్స్యకారులు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేసి మత్స్యకారుల సంక్షేమాభివృద్ధి కోసం పాటుపడతారు.

మత్స్యకారులకు అండగా...

సాగరమిత్రలు మత్స్యకారులు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటారు. మత్స్యకారులకు నిత్యం, సలహాలు, సూచనలు అందజేస్తారు. వేట సమయంలో జాగ్రత్తలు తెలియజేస్తారు. తుపాన్‌ సమయంలో రక్షణకు తోడుగా ఉంటారు. మత్స్యకారుల సంక్షేమాభివృద్ధి కోసం పనిచేస్తారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం ద్వారా ప్రభుత్వం వీరిని నియమిస్తోంది. ప్రస్తుతం 23 మంది సాగరమిత్రల నియామకం జరుగుతోంది.

– పి.సురేష్‌, జిల్లా మత్స్యశాఖాధికారి

న్యూస్‌రీల్‌

పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top