
గంజాయి,మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించాలి
బాపట్ల : రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి రేషన్ డీలర్లకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ సరుకులు షాపుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ విధానం జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఒకటో తేదీన షాపులను ప్రజాప్రతినిధులతో ఘనంగా ప్రారంభించాలని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు షాపులు తెరచి ఉంచాలన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు సరుకులను పంపిణీ చేయాలన్నారు. ప్రతి కార్డుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి సరుకులను అందజేయాలన్నారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించే వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల ఇన్‌చార్జి అధికారి లవన్న, పౌర సరఫరాల మేనేజర్ శ్రీనివాసరావు, రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు రామలక్ష్మి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
యోగాంధ్రను విజయవంతం చేయాలి
ఈనెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరం నుంచి యోగాంధ్ర క్యాంపెయిన్ అంశంపై ఎంపీడీవోలు, గ్రామస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఒక్కో మండలంలో 30 వేల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ప్రతి సచివాలయం ఉద్యోగి 300 మందిని రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్‌లో 2500 నుంచి 5000 మందితో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలి
ప్రజలు నివాసం ఉండే గ్రామాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. పంచాయతీశాఖలో చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, గ్రామాల పరిశుభ్రతపై స్థానిక సాయిరామ్ గ్రాండ్ కన్వెన్షన్ హాలులో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందని అన్నారు. ఇప్పటివరకు గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతోనే గ్రామాలు అపరిశుభ్రంగా మారాయని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రక్షాళన జరగాలి, ఇందుకోసం జూన్ 21వ తేదీ వరకు సమయం ఇస్తామని, ఆ తర్వాత గ్రామాలలో రహదారుల వెంట చెత్త కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాలు సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గంజాయి, మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. నషా ముక్త్ భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మాదక ద్రవ్యాల నిర్మూలన–మత్తు రహిత సమాజం మన లక్ష్యం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. అదనపు ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, విక్రయాలను అరికట్టడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.