చీరాల: మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ నారాయణపూర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట. జాండ్రపేటలో సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. బాల గంగాధరరావు, సుబ్బరావమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి బాలగంగాధరరావు ఇరిగేషన్ శాఖ లో ఉద్యోగిగా పలు ప్రాంతాలలో పనిచేశారు. రెండో సంతానంగా నాగేశ్వరరావు జాండ్రపేట హైస్కూల్‌లో విద్యాభ్యా సం పూర్తి చేసి గుంటూరు జిల్లా నల్లపాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో చదివారు. 17 ఏళ్ల వయస్సులోనే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యంలోకి జీవితకాలం కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. సోదరి వివాహానికి పెరోల్‌పై విడుదలైన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
గుంటూరు జిల్లా ఉద్యమంలో ‘ఏసన్న’గా పేరు...
గుంటూరు జిల్లాలో జరిగిన ఉద్యమంలో నాగేశ్వరరావుకు ఏసన్నగా పేరుంది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రజా యుద్ధ సైనికుడిగా నల్లమల, ఆంధ్ర ఒడిశా బోర్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ రైతాంగ, దళిత, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు. టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. విప్లవోద్యమ అవసరాలలో భాగంగా ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ మిలటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నారాయణపూర్ ఎదురు కాల్పుల్లో సజ్జా నాగేశ్వరరావు మరణించారని మీడియాలో రావడంతో ఆయన సోదరుడు సజ్జా శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు. తమ్ముడి మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం కోరారు.
నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో
సజ్జా మృతి
36 సంవత్సరాలుగా
విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం