
5న ‘చలో విజయవాడ’ కార్యక్రమం
మంగళగిరి: జూన్ 5వ తేదీన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. జూన్ 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘానికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, మంగళగిరి తాలూకా యూనిట్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి మాధవరావు, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
అందరూ మొక్కలు
నాటి సంరక్షించాలి
కాజ (మంగళగిరి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని కాజలో గురువారం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెప్మా డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు సభ్యులు తొలుత కనీసం ఒక్క మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడంపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మహిళలకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, మెప్మా పి.డి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజే విద్యామిత్ర కిట్లు అందిస్తాం
ప్రత్తిపాడు: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందించడం జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఐ. పద్మావతి అన్నారు. ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మండల స్థాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్‌ను గురువారం ఏపీసీ పరిశీలించారు. క్వాలిటీ వాల్‌తోపాటు బ్యాగుల నాణ్యతను పరిశీలించారు. స్టాక్ పాయింట్‌కు చేరిన పుస్తకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించడం జరుగుతుందన్నారు. వెంట ఎంఈవో–2 జి. లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇకపై వజ్ర కిరీటంతో దుర్గమ్మ దర్శనం
ప్రతి పౌర్ణమి రోజున అలంకరించాలన్న ఈవో శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రతి పౌర్ణమిన అమ్మవారికి స్వర్ణకవచంతో పాటు వజ్ర కిరీటాన్ని అలంకరించాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ వైదిక కమిటీకి సూచించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ముఖ్య అర్చకులతో ఈవో శీనానాయక్ గురువారం సమావేశమయ్యారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి వైదిక కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్, మల్లేశ్వర శాస్త్రి, సుందరంబాబులతో పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు. ఈవో శీనానాయక్ మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో జరిగే వైదిక కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించాలని, నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించారు. దేవతామూర్తుల అలంకరణ, వస్త్రాలు వైభవంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, కోట రవికుమార్, ముఖ్య అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఏఈవోలు పాల్గొన్నారు.