ఆదాయం– 14, వ్యయం– 11, రాజయోగం– 7, అవమానం– 5
పూర్వాభాద్ర 4 వ పాదము (ది)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)
రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)
ఈ సంవత్సరం గురువు మిథునంలో (అర్ధాష్టమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (పంచమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (షష్ఠం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (జన్మం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (వ్యయం) కేతువు సింహంలో (షష్ఠం); తర్వాత రాహువు మకరంలో (లాభం) కేతువు కర్కాటకంలో (పంచమం) సంచరిస్తారు.
దైనందిన కార్యక్రమాలో మిశ్రమ స్పందనగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలలో కుటుంబసభ్యుల ధోరణి సరిపడదు. మనసు సరిలేని స్థితి. తరచుగా పనులు మరచిపోతుంటారు. అక్టోబర్ వరకు ప్రతిభకు తగిన గుర్తింపు దొరకదు. పనులు సానుకూలమే కాని, ఆలస్యం అవుతాయి. అక్టోబర్ వరకు అనాలోచితంగా ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలలో ఇబ్బంది ఉండదు. అన్ని కార్యక్రమాలోనూ తగిన ఆర్థిక వనరులను స్వయంగా సమకూర్చుకుంటారు.
జూన్ తర్వాత శుభ పుణ్య సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఫైనాన్స్ వ్యాపారులు అక్టోబరు నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. పాత ఋణాలు ఇబ్బందికరం కాదు. ద్వితీయార్ధం కొత్తవి కావలసిన రీతిగా అందుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలు తీరతాయి. చర్మవ్యాధులు ఉన్నవారికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ కార్యకలాపాలలో జూన్ వరకు పనులు ఆలస్యంగా సాగుతాయి. జూన్ తరువాత క్రమంగా అక్టోబర్ వరకు మంచి మార్పు ఉంటుంది. అక్టోబర్ తరువాత ప్రమోషన్ అవకాశాలు ఎక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి.
వ్యాపార్తలకు ఆశించిన మంచి ఫలితాలు ప్రారంభంలో ఉండవు కాని, క్రమంగా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ చిగురిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు లేని స్థితి. షేర్ వ్యాపారులు నవంబర్ నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సజావుగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలలో ఏదో ఒక స్థాయిలో సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. ఈ రాశి స్త్రీలకు బుద్ధికుశలత ప్రదర్శించడానికి అవకాశం లేని పరిస్థితులు. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. గర్భిణులు జాగ్రత్తలు పాటించడం ద్వారా సుఖపడతారు.
పూర్వాభాద్ర 4: ద్వితీయార్ధంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ ధనవ్యయం అధికం. ఏ పనీ సకాలంలో చేయరు. అయినా అన్ని పనులు సానుకూలం. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు.
ఉత్తరాభాద్ర: ఎక్కువ కాలం పనులు మందగమనం. తరచుగా జీర్ణ, చర్మసంబంధ సమస్యలు రాగలవు. ఆలోచనలు అమలు చేయుదిశగా ఎవరితోనూ మనోభావాలను పంచుకోరు.
రేవతి: అద్భుతమైన మాటతీరుతో ఎన్నో విజయాలు అందుకుంటారు. బంధు మిత్రులు బాగా సహకారం చేస్తారు. వృత్తిరీత్యా ఏర్పడుతున్న ఆలస్యం గురించి చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు.
శాంతి మార్గం: శని రాహు కేతువులకు సంవత్సరారంభంలోను, అక్టోబర్‌లో శని గురువులకు శాంతి చేయించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ‘మంచం’ దానం చేయండి. నిత్యం ప్రదోషకాలంలో శివ సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.
ఏప్రిల్: చాలా వ్యవహారాలలో పనులు ఆలస్యం. నిత్యకృత్యాలు కూడా అకాలంలో సాగిస్తారు. అధికారుల వ్యతిరేకత ఉంటుంది. వాహనాలు తరచు మరమ్మతులకు వస్తుంటాయి. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.
మే: క్రమంగా మంచి ఫలితాలు ప్రారంభం అవుతాయి. భవిష్యత్ మీద ఆశ జనిస్తుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలలో పాల్గొనడం, పుణ్యకార్యాలు చేసే ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు క్రమంగా మంచి ఫలితాలు ఉంటాయి.
జూన్: పెద్దల ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటించండి. పిల్లల విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఓర్పుగా ఉంటారు. అయితే చాలాసార్లు నిరుత్సాహంగా ఉంటారు. పనులు స్వయంగా చేసుకోవడం అవసరం. దూరప్రయాణాలు విడనాడండి.
జులై: తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. రోజువారీ పనులు అకాలంలో జరుగుతాయి. స్వబుద్ధితో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి ప్రయత్నాలు తేలికగా పూర్తి అవుతాయి. కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు, శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి.
ఆగస్ట్: శ్రమతో పనులు పూర్తవుతాయి. మాటతీరు నియంత్రించుకోవాలి. అవగాహన లోపాలు పెరిగి ఉద్యోగ వ్యాపారాలలో చికాకులు. నూతన ప్రయత్నాలు వేగంగా చేసినా, ఫలితం ఉండదు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు.
సెప్టెంబర్: శుభకార్య ప్రయత్నాలలో విశేష ఫలితాలు. సోమరితనం ప్రదర్శించి పనులు పాడు చేస్తారు. ఆర్థిక లావాదేవీలను స్వయంగా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర ఘటనలు. మంచి పనులపై దృష్టి కేంద్రీకరిస్తారు.
అక్టోబర్: నిత్యకృత్యాలు అకాలంలో చేయడం వలన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రతి పనిలోనూ వ్యాకులతకు లోనవుతారు. బంధుమిత్రులతో కలహాలకు అవకాశం ఇవ్వకండి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలం. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తొందరపాటును విడనాడాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం.
నవంబర్: రోజువారీ పనులు సరిగా సాగవు. సహకరించే వారు కూడా వ్యతిరేకించే పరిస్థితి. నూతన ప్రయత్నాలు విఫలం. ఉద్యోగ భద్రత, వ్యాపార అనుకూలత తక్కువ. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల నుంచి శత్రుభావం ఎక్కువ. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది.
డిసెంబర్: ఆరోగ్యం జాగ్రత్తలు పాటించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. రోజువారీ పనులకు, ఉద్యోగ విధులకు సమన్వయం కుదరక ఇబ్బందులు. ఆర్థిక, కుటుంబ, వృత్తి విషయాలలో ఇతరుల సలహాలు తీసుకోకండి. కొత్త ఋణాలు చేయవద్దు.
జనవరి: బుద్ధికుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. పాత సమస్యలు పరిష్కరించుకుంటారు. ధనం వెసులుబాటు, ఆరోగ్యం బాగుంటాయి. కుటుంబ సమస్యలు తీర్చుకోవడంలో తెలివిగా ఉంటారు.
ఫిబ్రవరి: చేపట్టిన పనులు తేలికగా పూర్తికావు. తెలివి ధైర్యం విడనాడరు. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు సమర్థంగా సాధిస్తారు. నూతన ప్రయత్నాలు వేగం అవుతాయి. సామాజిక కార్యక్రమాలలో కీర్తి పెరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలకు అనుకూలం. అందరి నుంచి ఆశించిన సహకారం అందుతుంది.
మార్చి: మంచి ఫలితాలు ఎన్ని ఉంటాయో, ఇబ్బందికర అంశాలు కూడా అన్ని ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. అందరికీ సలహాలు ఇస్తుంటారు. అతిధోరణితో తోటివారి నుంచి చికాకులు కొని తెచ్చుకుంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, నూతన వృత్తి ప్రయత్నాలలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
పుష్కర నిర్ణయము
యమునా నదీ పుష్కరములు: ది.01–06–2026 తెల్లవారితే 02–06–2026 గం.12:17లకు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం. యమునానదీ పుష్కరాలు ప్రారంభం. రాత్రికాలంలో గురువు ప్రవేశం అయినది కావున 2వ తేదీ నుంచి 12 రోజులు పుష్కరదినములుగా గణన చేయవలెను. అధిక జ్యేష్ఠ బహుళ విదియ మంగళవారం నుండి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశీ శనివారం వరకు. ముఖ్య గమనిక : పితృశ్రాద్ధం చేశాక దేవాలయములకు వెళ్ళరాదు. నేడు పుష్కరాలు వ్యాపారధోరణిని అనుసరిస్తున్నాయి. పితృకార్యం చేసిన రోజు ఇతర దేవతా ఆరాధనలకు విశేషం లేదు.
పితృ దేవతలే ప్రతిమనిషి జీవితంలోను ప్రధాన దేవతలు. పుష్కర యాత్రకు వెళ్ళినవారు ముందురోజే దేవాలయ సందర్శనం చేయండి. పితృ దేవతా సంబంధంగా కార్యం చేసిన రోజు దేవాలయ దర్శనం కూడదు. (పితృకార్యం అనంతరం). గమనించి సంచరించండి. పుష్కర సందర్భంగా ప్రారంభం నుంచి 12 రోజులు పూర్తిగా పుష్కరుడు ఆ పుష్కర నది మీదే విహరిస్తూ ఉంటారు. కావున 12 రోజులు 24 గంటలూ కూడా విశేషమే.
అయినప్పటికీ రాత్రి 2వ యామము, 3వ యామము స్నానానికి నిషేధము. అలాగే కృత్రిమమైన మురికినీరుతో పుష్కరశ్రాద్ధము చేయుట కూడా నిషేధమే. పుష్కరాలు 12 రోజులు అయిన తరువాత ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో ఆ నదిమీదే పుష్కరుడు విహరిస్తాడు. అందువలన ఆ సంవత్సర కాలంలో ఏ రోజైననూ అపరాహ్ణ కాలంలో ఆ పుష్కరనదిని ఉద్దేశించి శుచిగా, శుభ్రమైన జలంతో పుష్కరశ్రాద్ధము నిర్వహించవచ్చు. అది ఈ 12 రోజుల మధ్యలో చేసిన ఫలితాన్నే సూచిస్తుంది. రాబోవు ప్లవంగ సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలు: ది.26–06–2027 ప్లవంగ జ్యేష్ఠ బహుళ సప్తమీ శనివారం గోదావరి నదీ పుష్కరాలు ప్రారంభం.


