కుంభ రాశి: ఏలినాటి శని ప్రభావం… ఈ రాశివారికి పరీక్షల సంవత్సరం | Kumbha Rashi- Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27 | Sakshi
Sakshi News home page

కుంభ రాశి: ఏలినాటి శని ప్రభావం… ఈ రాశివారికి పరీక్షల సంవత్సరం

Mar 18 2026 6:49 AM | Updated on Mar 18 2026 6:49 AM

Kumbha Rashi- Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 4, అవమానం– 2
ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)

ఈ సంవత్సరం గురువు మిథునంలో (పంచమం) జూన్‌ 1 వరకు ఉంటారు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (షష్ఠం) అక్టోబర్‌ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (సప్తమం) సంచరిస్తారు. శని సంవత్సరమంతా మీనంలో (ద్వితీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్‌ 6 వరకు కుంభంలో (జన్మం) కేతువు సింహంలో (సప్తమం) తర్వాత రాహువు మకరం (వ్యయం)లో కేతువు కర్కాటకంలో (షష్ఠం) సంచరిస్తారు.

దైనందిన కార్యక్రమాలలో ఒక మాయ వెంబడిస్తున్నట్లుగా ఉంటుంది. పనులు సమయపాలనతో చేయలేరు. ఫలితంగా ఇతర పనులు పాడవుతాయి. కుటుంబ విషయాలు సహా అన్ని వ్యవహారాలలోనూ ఏలినాటి శని, జన్మ వ్యయ రాహు ప్రభావంగా వృథా కాలక్షేపాలు, దాటవేత పద్ధతి, అవమానించడం, అవమానాలు పొందడం, పరుష వాక్య ప్రయోగంతో ఇబ్బందులు పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలలో ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. ఋణ వ్యవహారాలలో అవమానం ఎదురవుతుంది. ఫైనాన్స్‌ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం పట్ల తగిన దృష్టి ఉంచరు. పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగ కార్యకలాపాలలో సరైన నిర్ణయాలు చేయలేరు. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. అధికారుల ఒత్తిడి జూన్‌ తరువాత పెరుగుతుంది. మార్కెటింగ్‌ ఉద్యోగులకు అనుకూలత లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. వ్యాపారులకు మానసిక ఒత్తిడి, మోసపూరిత వాతావరణం. స్వయంగా పరిశీలించాకనే నిర్ణయాలు చేయండి. ఇతరుల జోలికిపోవద్దు.  నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు సమయపాలనతో సాగవు. 

షేర్‌ వ్యాపారులలో ఆలోచనకు, అమలుకు పొంతన ఉండదు. విద్యార్థులకు మానసిక సానుకూలత ఉండదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. కోర్టు వ్యవహారాలలో సమస్యలు పెరుగుతాయి. స్థిరాస్తి లావాదేవీలు ఇబ్బందికరం. ఈ రాశి స్త్రీలకు పని ఒత్తిడి ఎక్కువ. తరచుగా చికాకులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. ఉద్యోగంలో ఎదుగుదల లోపిస్తుంది. గర్భిణులకు జాగ్రత్తలు అవసరం. పెద్దలు, వైద్యుల సలహాలు పాటించండి. ప్రయాణాలు తగ్గించండి.

ధనిష్ఠ 3, 4 : మోసపూరిత వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో  జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడిన పనులు ఇబ్బంది కలిగిస్తాయి. వస్తువులు మరచిపోవడం, చోరీ కావడం వంటివి జరుగుతాయి.

శతభిష: కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓర్పు, సహనం అవసరం. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తపడండి. కొత్త వ్యవహారాలలో తలదూర్చకండి. ఋణాలు చేయవద్దు. ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం.

పూర్వాభాద్ర 1, 2, 3: ఆగ్రహావేశాలు తగ్గించాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగండి. వృథా కాలక్షేపాలకు స్వస్తి పలకండి. తక్కువ స్థాయి వారి నుంచి ప్రమాదాలకు అవకాశం. 

శాంతి మార్గం: గ్రహచారం పూర్తి విరుద్ధంగా ఉన్నందున రోజూ రామాయణ పారాయణ చేయడం శ్రేయస్కరం. శని గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. ఇష్టదైవ నామస్మరణ చేయండి. రోజూ దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయడం ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.

ఏప్రిల్‌: కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. చాలావరకు పనులు సఫలం. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. 10వ తేదీ నుంచి పనులు వేగం అందుకుంటాయి. విద్యా వ్యాసంగం ఇబ్బందికరం. వృత్తిలో అధికారుల సహకారం గొప్పగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తారు.

 మే: ఒంటరి కాలక్షేపాలు, ఒంటరిగా ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. మోసపూరిత వాతావరణం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మొండి ధైర్యం పెరుగుతుంది. తెలివిగా ఉంటారు. అలా ఉన్నా, చికాకుపడే అవకాశం ఉన్నది. స్థిరాస్తి వ్యవహారాలు చికాకులు సృష్టిస్తాయి. 

జూన్‌: ప్రతిపనికీ ఆదాయ వనరులు ఇబ్బందికరం. కుటుంబసభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు. విద్యార్థులు, ఫైనాన్స్‌, షేర్‌ వ్యాపారులకు బుద్ధి స్థిరంగా పనిచేయక ఇబ్బందిపడే అవకాశం ఉంది.

 జులై: ఇతరుల విషయాల జోలికి వెళ్ళవద్దు. ఆర్థిక వ్యవహారాలు అదుపులో ఉండవు. తెలియక పొరపాటు చేసి పశ్చాత్తాపపడే పరిస్థితి ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు. విద్యావ్యాసంగం సరిగా సాగదు.

 ఆగస్ట్‌: కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. సంబంధంలేని సమస్యలకు బాధ్యత వహించవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు విరమించడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. అజీర్ణ సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది.

 సెప్టెంబర్‌: పనులు చక్కగా పూర్తవుతాయి. తెలియక పొరపాట్లు చేసి పశ్చాత్తాపపడతారు. అందరినీ గౌరవించడం, అందరి చేత గౌరవం పొందడం జరుగుతుంది. వృత్తి రీత్యా జాగ్రత్తలు తీసుకుని ఫలితాలు సాధిస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. 

అక్టోబర్‌: పుణ్యకార్యాలలో కాలక్షేపం చేస్తారు. ప్రతిపనినీ సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలకు పరిష్కారం అందుతుంది. ఇతరులకు సలహాలు చెప్పి కొన్ని సందర్భాలలో గౌరవం పొందుతారు. కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు. 

నవంబర్‌: పని ఒత్తిడి ఎక్కువ. ఫలితాలు శూన్యం. రోజువారీ పనులు సరిగా సాగవు. పుణ్య శుభకార్యాలలో ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలతలు. అవసరానికి కావలసిన ధనం, ఋణం సర్దుబాటు కాని స్థితి. 

డిసెంబర్‌: తెలివిగా వ్యవహరిస్తారు. శ్రమతో పనులు పూర్తి అవుతుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో విచిత్ర పరిస్థితులు. అధిక వ్యయం ఉంటుంది. ఓర్పుతో కుటుంబ విషయాలు సర్దుబాటు చేసుకుంటారు. అనవసర విషయాలలో భయాందోళనలు పెరుగుతాయి. 

జనవరి: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మోసపూరిత వాతావరణం అధికం. కొత్త వ్యవహారాలు చేయరాదు. ఆర్థిక లావాదేవీలు సమన్వయం చేయలేక ఒత్తిడికి లోనవుతారు. అందరినీ అవమానించడం, అవమానింపబడడం వంటివి జరిగి చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. 

ఫిబ్రవరి: ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యమైన అంశాలు వదిలివేసి అధికారుల ఆగ్రహావేశాలకు లోనవుతారు. ప్రయాణ చికాకులు, వాహన చికాకులు ఉంటాయి. విద్యార్థులు కాలానుగుణంగా ప్రవర్తించని స్థితి ఉంటుంది. 

మార్చి: ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం. కావలసిన సమయానికి ఋణాలు దొరకవు. ప్రయాణ అసౌకర్యం తరచుగా ఎదురవుతుంది. వస్తువులు మరచిపోవడం కాని, దొంగతనానికి గురవడం కాని జరుగుతుంది. మీ ప్రవర్తన పిల్లల దగ్గర తేలికపడేలా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement