పాఠం చెప్పమంటే పాట పాడుతున్న మాష్టారూ..!

Guntur Government Teacher Teaches Lessons In Song Form - Sakshi

విద్యార్థులకు ఆసక్తి.. బోధనలో వినూత్నం

యడ్లపాడు(గుంటూరు): ఆ మాష్టారూ ఎక్కడ ఉన్నా..విద్యార్థులు స్కూల్‌కు డుమ్మా కొట్టారు. ఎందుకంటే ఆ బడిలో పుస్తకాలు తెరిచి పాఠాలు చెప్పరు..కాని అక్కడి పిల్లలకు ఆ పుస్తకాల్లోని పాఠాలన్నీ కంఠోపాఠం అవుతాయి. ప్రాథమిక విద్యాబోధనను కొందరు పిల్లల వేలుపట్టి రాయించి నేర్పిస్తారు. మరికొందరు బట్టీ పట్టిస్తారు. ఇంకొందరు బొమ్మలతో బోధన  చేస్తారు. ఆయన వీటన్నింటికీ భిన్నం. అదేమని ప్రశ్నిస్తే..పాఠం ఎలా బోధించామన్నది కాదు వాటిని ఎంత శ్రద్ధగా విని పిల్లలు గుర్తుంచుకున్నరన్నదే ప్రధానమంటారు. బడి అంటే భయం..పాఠం రాలేదనే టెన్షన్‌ లేకుండా చెప్పడమే తన లక్ష్యం అంటారు.

పాఠం పాటయితే..
ఆయన తరగతి గదికి పాఠ్యపుస్తకం బదులుగా పాటల పుస్తకం తీసుకువస్తారు. అతని చేతిలో చాక్‌పీస్‌కు మారుగా స్మాల్‌మైక్‌ ఉంటుంది. పాఠాలు చెప్పాల్సిన గొంతునుంచి ట్రాక్‌మ్యూజిక్‌ సౌండ్‌తో కమ్మని పాటలు వినిపిస్తాయి. ఆయన గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉందికదూ.. ఆయన స్వరబోధనే అక్కడ సమ్‌థింగ్‌ స్పెషల్‌ అన్నమాట. ఈ వినూత్న బోధకుడు గుంటూరు జిల్లాకు చెందిన పరావస్తు హనుమాసూరి.

ఆలోచన అలా అంకురించింది...
ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మాస్టారు క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం అలవాటు. గుళ్లో ఓ సాయంత్రాన ఏర్పాటైన కార్యక్రమంలో భజన బృందం రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. పరిస్థితిని అర్థం చేసుకుని జేబులోని సెల్‌ఫోన్‌ తీసి ట్రాక్‌మ్యూజిక్‌ ఆన్‌చేసి తనకు వచ్చిన భక్తిగీతాలను ఆలపించారు. ట్రాక్‌మ్యూజిక్‌తో పాడిన ఆయన పాటలకు అర్చకుడితో పాటు భక్తులంతా ఫిదా అయ్యారు. పెద్దవాళ్లనే ఆకర్షించిన ట్రాక్‌మ్యూజిక్‌ విధానం గుడితో పాటు బడిలోనూ అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచన అంకురించింది. 

పాటలతో పాఠాలబోధన ప్రస్థానం ఇక్కడి నుంచే...
సూరి మాష్టారు పాటల ద్వారా పాఠాలను బోధించే స్వర ప్రస్థానాన్ని యడ్లపాడు మండలం నుంచే ప్రారంభించారు. కొండవీడు హెచ్‌డబ్ల్యూ స్కూల్‌కు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు హెచ్‌ఎంగా బాధ్యతలు ఇచ్చారు. కాలనీ వాసుల్లో అత్యధికశాతం నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు కావడంతో పట్టించుకునే వారులేక పిల్లలు బడికి రావడం కష్టమైంది. పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లల్ని బడిబాట పట్టించాలనే ఆలోచన, అవ్వేషణలోనే గుడిపాట బడికి చేరింది. 

మైండ్‌ట్యూనింగ్‌ ఇదుగో ఇలా..
పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను వివిధ సినిమా పాటలుగా మార్చుచేసి గానం చేస్తారు. స్కూల్‌ ప్రారంభ దశలో పేరడీ పాటలు పాడి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ఆకర్షిస్తారు. తర్వాత పాఠాలను వాడుక భాషలో బాగా అర్ధమయ్యేలా చిన్నచిన్న పదాలుగా తర్జుమా చేసి పాడేస్తారు. 

రోజు పాఠశాలకు వస్తూ తన సెల్‌ఫోన్‌లో ఏదోఒక సినిమా పాటకు సంబంధించిన మ్యూజిక్‌ట్రాన్‌ను ఎంచుకుని రావడం, ఆరోజు చెప్పాల్సిన పాఠాన్ని ఆ ట్రాక్‌లో పాడటం, పిల్లలచే పదేపదే పాడించడంతో విద్యార్థులకు కంఠోపాఠం అవుతాయి. దీంతో పాఠం శాశ్వతంగా గుర్తుండమే కాదు, తరచు అందరితో కలిసి పాడటంతో స్టేజీఫియర్‌ కూడా పోతుంది. అన్నింటికి మించి పిల్లల్లో ఉత్సుకత, ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుంది.  ప్రతిపాఠం పదమై, చిన్నగొంతులో స్వరమై వారి పెదాలపై లయబద్ధంగా నాట్యం చేస్తుంది.  

500లకు పైగా పేరడీ పాటలు...
మాట గుండెల్లో దూసుకెళ్లే తూటా అయితే.. ఆ గుండెగాయాన్ని మాయం చేసే పాట అమృతమే కదా. సూరి మాష్టారూ విద్యార్థులకు పాఠ్యాంశాలపై రూపొందించిన పాటలు బోర్‌ కొట్టకుండా ఉండేందుకు ప్రత్యేక పేరడీ పాటల్ని రాసి పాడించి నవ్విస్తారు. భక్తి, దేశభక్తి, అభ్యుదయం, మానవీయం కోణాల్లోనూ పాటల్ని నేర్పించి వారిని మంచి క్రమశిక్షణతో దేశభక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. సినీ గీతాలను మార్పు చేసి తనకు అనుగుణంగాఇప్పటికీ 500పైగా పాటలు రచించారు.

ప్రముఖ కవి పరావస్తు చిన్నయసూరి వంశీయుడే..
నీతి చంద్రిక, బాలవ్యాకరణం, మిత్రలాభం వంటి రచించిన ప్రముఖ కవి పరవస్తు చిన్నయసూరి వంశీయులు హనుమసూరి కావడం విశేషం. మద్రాసులోనిపెరంబుదుర్‌ స్వస్థలం కాగా వీరి తాతగారు జీయర్‌సూరి శతాబ్ధాకాలం కిందట బతుకుదెరువు కోసం ఆంధ్రరాష్ట్రానికి కుటుంబంతో సహా వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుకు నలుగురి సంతానంలో సూరి చివరిసంతానం. పెద్దవారు ముగ్గురు కుమార్తెలే.

మొదట రెంటచింతల మండలంలోని తుమ్మురుకోటలో ఉన్న వీరి కుటుంబం, ఉద్యోగ నిమిత్తం ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండల కేంద్రానికి మారారు. ఏంఏ బీఈడీ పూర్తిచేసిన సూరి ప్రస్తుతం ఇదే మండలంలోని డోకిపర్రు గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. 

అలా సేవలు చేస్తున్నారు..
నాన్‌వెజ్‌తో వచ్చే ఇబ్బందులు–ఆకుకూరలతో చేకూరే ఆరోగ్యం, స్నేహం విలువ, భారతీయ సంప్రదాయాలు, తల్లిదండ్రులు, గురువులను పూజించడం, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవసరమైన క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం వంటి అనేక కోణాల్లో సూరి పేరడీ రచనలు చేశారు. ఆయన రాసిన ప్రతిపాట సినీబాణీ అయినా..సమాజ హితాన్ని కోరే భావం అందులో దాగుంటుంది. తన పాటలు బడి,గుడిలోనే కాదు బంధుమిత్రుల శుభకార్యాలలోనూ పాడుతుంటారు. తన పేరడీ పాటలకు మెచ్చి వారిచ్చే కానుకలు, నగదును అనాధ, వృద్ధాశ్రమాలకు ఇవ్వడం సూరి సేవాగుణానికి నిదర్శనం. 

అదే తృప్తి..పరవస్తు హనుమాసూరి, ఎస్జీటీ
చిన్ననాటి నుంచి సాహీత్యం అంటే ఇష్టం. బహుశ కవి వంశీయులు కావడమే కావొచ్చు. పేరడీ అంటే ఇష్టపడని వారుండరు. కాని అది రాయడం ఒకింత కష్టమే. సాహిత్యంలో విభిన్నం ఉండాలని, అవి భావితరాలకు, సమాజానికి ఉపయోగపడేలా ఉండలన్నదే ఆకాంక్ష. 
 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top