జలయజ్ఞ ఫలం..జనానికి వరం! | - | Sakshi
Sakshi News home page

జలయజ్ఞ ఫలం..జనానికి వరం!

Sep 18 2026 1:45 AM | Updated on Sep 18 2026 1:45 AM

చిప్పిలి ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి

కృష్ణమ్మ పరవళ్లు

మదనపల్లె ప్రజల దశాబ్దాల దాహార్తికి శాశ్వత పరిష్కారం

రూ. 239 కోట్ల వ్యయంతో

5 ప్యాకేజీల పనులన్నీ పూర్తి చేసింది వైఎస్సార్‌ హయాంలోనే

మూడు విడతల్లో ఏకంగా

6.46 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించిన జగనన్న

సాక్షి, మదనపల్లె: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించిన చరిత్రాత్మక జలయజ్ఞ ఫలం నేడు మదనపల్లె పట్టణ ప్రజల కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. మదనపల్లె పట్టణ తాగునీటి అవసరాలను తీర్చే చిప్పిలి ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి కృష్ణా జలాలు చేరి జలకళను తెచ్చాయి. 2006లో సాహసోపేతంగా హంద్రీనీవా ప్రాజెక్టును చేపట్టడానికి ముందు వైఎస్సార్‌ మదనపల్లె ప్రజల నీటి కష్టాలను కళ్లారా చూశారు. నాడు నరేష్‌ కుమార్‌ రెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉండగా వైఎస్సార్‌ ఎన్నికల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. చిత్తూరు బస్టాండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, మదనపల్లె నీటి సమస్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2004లో సీఎం అయ్యాక మదనపల్లె ప్రజలకు శాశ్వత తాగునీటి కష్టాలు తీర్చేలా సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు.

రూ. 239 కోట్లతో వైఎస్సార్‌ జలవిప్లవం

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల నిర్మాణం కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగే హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువలో అంతర్భాగంగా పనులు చేశారు. టెండర్లు జరగడం, ప్రభుత్వంతో కాంట్రాక్టర్లు ఒప్పందాలు కుదుర్చుకోవడం, శరవేగంగా పనులు సాగడం అంతా వైఎస్సార్‌ పాలనలోనే జరిగాయి. సత్యసాయి జిల్లా సరిహద్దు నుంచి ప్రారంభమయ్యే కాలువ కిలోమీటర్‌ 74 నుంచి 110 వరకు పనులకు 27వ ప్యాకేజీ కింద రూ. 72.73 కోట్లు, 28వ ప్యాకేజీలో 110వ కిలోమీటర్‌ నుంచి 150 వరకు రూ.83.80 కోట్లు కేటాయించారు. ప్యాకేజీ 59లో 150వ కిలోమీటర్‌ నుంచి 173 వరకు రూ.69.91 కోట్లతో ఏపీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీతో ఒప్పందం జరగ్గా, దీని కిందనే 0.08 టీఎంసీల సామర్థ్యంతో 1.05 కిలోమీటర్ల బండ్‌తో చిప్పిలి ట్యాంకు, 0.131 టీఎంసీల సామర్థ్యంతో 1.50 కిలోమీటర్ల బండ్‌తో గుంటివారిపల్లె సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు నిర్మితమయ్యాయి. అలాగే ప్యాకేజీ 60 కింద రూ. 50.75 కోట్లు, ప్యాకేజీ 61 కింద రూ. 36.31 కోట్లతో ఒప్పందాలు జరిగాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేని 2010 నాటికే ఈ ప్యాకేజీల్లో రూ. 239 కోట్ల పనులు వంద శాతం పూర్తయ్యాయి. బాబు సీఎంగా పనిచేసిన 1995 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో పట్టుమని రూ. పది కోట్లు కూడా కేటాయించలేదు.

చంద్రబాబు మొక్కుబడి హడావుడి.. జగనన్న హయాంలోనే నీటి ప్రవాహం

ప్రాజెక్టు కోసం తాను ఏదో చేశానని చెప్పుకునే చంద్రబాబు, 2019 జనవరిలో మొక్కుబడిగా కేవలం 750 ఎంసీఎఫ్‌టీల నీటిని మాత్రమే కాలువకు తరలించి గొప్పలు చెప్పుకున్నారే కానీ, మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి దాహం తీర్చే సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు కృష్ణా జలాలు ఎందుకు తరలించలేదో సమాధానం చెప్పరు. ఈ ప్రాజెక్టు ద్వారా చిప్పిలి ఎస్‌ఎస్‌ ట్యాంకుకు తొలిసారి కృష్ణా జలాలు విజయవంతంగా తరలించింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీఎం జగనన్నే. వైఎస్సార్‌సీపీ పాలనలో మూడు విడతల్లో ఏకంగా 6.4618 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి తరలించారు. 2019 నవంబర్‌ 22 నుంచి మార్చి వరకు 1.84 టీఎంసీలు, 2020 నవంబర్‌ 12 నుంచి 2021 మే 15 వరకు 2.5218 టీఎంసీల నీటిని అందించి ప్రస్తుత అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 91 చెరువులకు జలకళ తెచ్చారు. మదనపల్లె, పుంగనూరులోని చిప్పిలి, గుంటివారిపల్లె, పుంగమ్మ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపి తాగునీటి కష్టాలను తీర్చారు. ఆ తర్వాత 2023 అక్టోబర్‌ 9 నుంచి 2024 మార్చి 5 వరకు మరో 2.6 టీఎంసీల జలాలను ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కుప్పం నియోజకవర్గంలోని మద్దికుంట, వెరశిచెరువు, చిట్టివానికుంటలకు తరలించి నింపింది కూడా జగనన్న పాలనలోనే జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement