● టీడీపీ కార్యకర్తలతో కలిసి
గ్రామ సచివాలయం ప్రారంభం
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రారంభించినట్లు శిలాఫలకం
సాక్షి, మదనపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అమరనాథరెడ్డి అధికార పరిధిదాటి అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యకర్తలా వ్యవహరించారు. ప్రజలచేత ఎన్నికై న ఎమ్మెల్యేను విస్మరించారు. గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ శిలాఫలకం వేసి దీన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారంటూ హడావుడి చేశారు. గురువారం జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘించిన సదరు ఎంపీడీవోకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మీ వైపు నుంచి జరిగిన ఈ తప్పిదం అధికారిక నియమావళిని ఉల్లంఘించడం, ప్రజలచే ఎన్నికై న ప్రతినిధిని అగౌరవపరచడం, అధికార విధులను నిర్లక్ష్యం చేయడం కిందకు వస్తుందని తెలుపుతూ మీపై (ఎంపీడీఓ) క్రమశిక్షణా చర్యకు ప్రభుత్వానికి ఎందుకు సిఫార్సు చేయకూడదో ఈ నోటీసు అందిన 48 గంటలలోపు వివరణ ఇవ్వాలి, అని ఎమ్మెల్యే జారీచేసిన షోకాజ్ నోటిసులో పేర్కొన్నారు. వివరాలు. ములకలచెరువు మండలం వేపూరికోటలో గత వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.35 లక్షలతో ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయ భవనం మంజూర్యయింది. అప్పట్లోనే పనులు ప్రారంభమై అసంపూర్తిగా నిలిచాయి. పూర్తయిన భవనాన్ని అధికారికంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి ఆహ్వానించి ప్రారంభించాల్సి ఉంది. అయితే స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీడీవో అమరనాధరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారి అన్న విషయాన్ని విస్మరించి పార్టీ కార్యకర్తలాగా వారితో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు.
శిలాఫలకంలో టీడీపీ కార్యకర్తల పేర్లు
ప్రభుత్వ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రజలచేత ఎన్నికై న ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. వారిని ఆహ్వానించాక ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే వేపూరికోట గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టీడీపీ ఇన్‌చార్జి శంకర్ యాదవ్ పేరును ప్రముఖంగా పెట్టి, ఆయన ఫోటో పెట్టారు. దాని కింద గౌరవ అతిథులంటూ ఎంపీ మిథున్ రెడ్డి, నాలుగో వ్యక్తిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేరును పెట్టారు. ప్రోటోకాల్ పూర్తిగా ఉల్లంఘించగా శిలాఫలకంలో టీడీపీ నాయకుల పేర్లు కూడా పెట్టుకున్నారు. ఈ విషయం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ శిలాఫలకంలో వేపూరికోట సచివాలయ భవనాన్ని గురువారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ.జనార్దన్ రెడ్డి ప్రారంభించినట్టుగా పేర్కొన్నారు. ఆయన రాకపోయినప్పటికీ ఆయన పేరుతో వేయడం ఎంపీడీఓ బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామ సచివాలయం ప్రారంభం విషయంలో స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులకు కూడా ఎంపీడీవో అమరనాథరెడ్డి కనీస సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.


