పుంగనూరు : మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో ఉన్న శ్రీబురడగుంట గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి హుండీని పగులగొట్టి అందులోని డబ్బు ఎత్తుకెళ్లారు. గురువారం ఆలయ తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి చోరీ జరిగినట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇళ్లలోకి వర్షపునీరు
చౌడేపల్లె : కొన్నినెలలుగా వర్షాలులేకపోవడంతో ఎండవేడిమికి అవస్థ పడుతున్న మండల ప్రజలకు గురువారం ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షం కాస్త ఉపశమనం కలించింది. గాలీ వాన తో సుమారు రెండు గంటల సేపు వర్షం కురిసింది. దీంతో వీధులు జలంతో నిండిపోయాయి. కాగా మండలంలోని కాగతి గ్రామంలో వీఽధి కాలువలు దురాక్రమణ గురికావడంతో వర్షపునీరు రోడ్డుపై నిల్వ ఉండి చెరువును తలపిస్తోంది. రోడ్డుపక్కనే ఉన్న పాఠశాల ఆవరణతోపాటు చౌకదుకాణం ముందు నిల్వ ఉండడంతోపాటు పాపులమ్మ ఒంటరి వృధ్ధురాలి నివాసంలోకి వర్షపునీరు వెళ్లింది. అధికారులు ఇకనైనా స్పందించి కాలువల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : ములకలచెరువు మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గూడుపల్లె పంచాయతీ తనకంటివారి పల్లెకు చెందిన మనోహర్ కుమారుడు రామ్‌చరణ్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. రామ్‌చరణ్ బైక్‌పై ములకలచెరువు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమద్యంలోని జోకులకోట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో రామ్‌చరణ్ తీవ్రంగా గాయపడగా, బైక్ నుజ్జునుజ్జయింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో రామ్‌చరణ్‌ను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


