● 29న యాజమాన్య కమిటీల ఎంపిక
● ప్రైవేటు పాఠశాలల్లోనూ ఎన్నికలు
మదనపల్లె సిటీ: బడిలో ఎన్నికల సందడి మొదలైంది. పాఠశాలల్లో యాజమాన్య కమిటీల (స్కూల్ మేనేజ్‌మెంట్) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా జిల్లాలోని ఎంఈవోలు, సీఆర్‌పీలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.జిల్లాలో 1,785 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, 7 ఎయిడ్ పాఠశాలలతో పాటు 473 ప్రైవేటు పాఠశాలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల ప్రాతిపదికన కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి తరగతి నుంచి ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఇతరుల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. కోరం తప్పనిసరి. ఎన్నికల అధికారిగా సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలు వ్యవహరిస్తారు. చేతులెత్తడం, నోటితో చెప్పడం ద్వారా ప్రక్రియ జరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఒక్కరు మాత్రమే ఓటేయడానికి అవకాశం కల్పిస్తారు. సభ్యుల్లో అఽధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఇద్దరిని ఎన్నుకుంటారు.
29న ఎన్నికల నిర్వహణ
ఈనెల 29వతేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సభ్యులంతా కలిసి చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. తర్వాత సాయంత్రం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు మొదటి సమావేశం నిర్వహిస్తారు. పాఠశాల అభివృద్ధి పనులు ఎస్‌ఎంసీ ఆద్వర్యంలో జరుగుతుండటంతో కొందరు నేతలు ఈ ఎన్నికలపై దృష్టి సారించారు.


