మిల్లర్ల సిండి కే వాళ్లు చెప్పిందే రే | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల సిండి కే వాళ్లు చెప్పిందే రే

Aug 3 2026 3:39 AM | Updated on Aug 3 2026 3:39 AM

బద్వేలు : అంతర్జాతీయ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు సామాన్యుడి కడుపు కొడుతుంటే.. బియ్యం మాఫియా, బడా మిల్లర్లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో బియ్యం మాయగాళ్లు సిండికేట్‌గా మారి రేట్లను ఇష్టారీతిగా పెంచేస్తూ పేదవాడి నడ్డి విరుస్తున్నారు. అటు పశ్చిమాసియా యుద్ధాన్ని, ఇటు ఎల్‌నినో కరువు పరిస్థితులను బూచిగా చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా క్వింటా ధరలను ఆమాంతం పెంచేసి కోట్లకు కోట్లు పోగేసుకుంటున్నారు.

ఆ పదిమందే బడా వ్యాపారులు.. 30 లక్షల క్వింటాల నిల్వలు!

జిల్లాలో ప్రధానంగా ఆరుగురు బడా రైస్‌ మిల్లర్లు, కొందరు వ్యాపారులు కలిసి ఇక్కడి బియ్యం, ధాన్యం వ్యాపారాన్ని పూర్తిగా శాసిస్తున్నారు. పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట ప్రాంతాలకు చెందిన వీరు.. ఎక్కడికక్కడ ముందే ధాన్యాన్ని కొనేసి తమ భారీ మిల్లులు, గోదాముల్లో దాచేస్తున్నారు. ప్రస్తుతం వీరి వద్ద 30 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం, బియ్యం నిల్వలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి, కొద్దికొద్దిగా సరుకును బయటకు వదులుతూ ధరలు పెంచుతున్నారు. పెరిగిన బియ్యం ధరలతో జనాన్ని అల్లాడిస్తూ కేవలం ఆ పదిమందే కోట్లు కూడబెట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

రెండు నెలల్లో రూ.10 కోట్లు పిండేశారు!

గత రెండు నెలల వ్యవధిలోనే బియ్యం ధరలను క్వింటాకు ఏకంగా రూ.2,000లకు పైగా పెంచేసిన మాఫియా, జనం సొమ్ము రూ.10 కోట్లకు పైగా పిండేసింది. రెండు నెలల కిందట క్వింటా రూ.4,800–5,100 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.6,700–7,000కు పెంచేశారు. రిటైల్‌ మార్కెట్‌లో నెల రోజుల కిందట రూ.1,200 ఉన్న 25/26 కిలోల సన్న బియ్యం బస్తా (టిక్కీ) ధర నేడు ఏకంగా రూ. 1,800లకు చేరింది. రాయచోటిలోని శరవణ బిగ్‌బజార్‌ మాల్‌లో పది కేజీల బియ్యం ధరను ఏకంగా రూ. 749లకు అమ్ముతున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో ఆగకుండా వచ్చే నెలలో క్వింటాకు మరో రూ.700లు పెంచి, ఇంకో రూ.10 నుంచి రూ.12 కోట్లు గుంజేందుకు అప్పుడే పన్నాగం పన్నారు.

రైతులకు టోకరా.. కూటమి సర్కార్‌ కొమ్ముకాపు!

జిల్లాలోని మిల్లర్లు ఖరీఫ్‌, రబీ సీజన్లలో సిండికేట్‌గా మారిపోయి ధరలను పూర్తిగా నియంత్రించారు. వర్షాల భయంతో ఉన్న రైతుల నుంచి కర్నూల్‌ సోనా, జిలకర మసూర, ఎన్‌డీఎల్‌ సన్న రకాల ధాన్యం (75 కిలోల బస్తా)ను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,770కే కొనుగోలు చేశారు. తీరా రైతుల దగ్గర ధాన్యం అయిపోగానే, అదే బస్తా ధరను మిల్లర్లు రూ.2,200 వరకు పెంచేశారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధర ప్రకారం కిలో సన్న రకం బియ్యం రూ.35–40 ఉండాలి. కానీ రిటైల్‌ మార్కెట్‌లో ఏకంగా రూ.65 నుంచి రూ.75 వరకు విక్రయిస్తున్నారు.

పడకేసిన పౌరసరఫరాల, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలు!

ధరలను నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు గుడ్లప్పగించి చూస్తున్నారే తప్ప బియ్యం మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదు. గతంలో బియ్యం ధరలు పెరిగితే సన్నరకాల బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించడంతో పాటు అక్రమ నిల్వలు ఉన్న మిల్లర్లపై తక్షణ చర్యలు తీసుకునేవారు.

కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పాలకులే మిల్లర్లకు, బడా వ్యాపారులకు కొమ్ముకాస్తుండటంతో వారి ఇష్టారాజ్యమైందని, బ్లాక్‌ మార్కెట్‌ యథేచ్ఛగా సాగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెరిగిన బియ్యం ధరలు తగ్గించి సామాన్యుల కడుపు నింపాలని జనం కోరుతున్నారు.

కూటమి ప్రభుత్వ అండతో మిల్లర్ల అడ్డగోలు దోపిడీ

ఎల్‌నినో, యుద్ధం పేరుతో ధరల అడ్డగోలు పెంపు

30 లక్షల క్వింటాళ్ల సన్న బియ్యం నిల్వలు బ్లాక్‌

మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించిన బియ్యం మాఫియా

రెండు నెలల్లోనే రూ.10 కోట్లు స్వాహా

వచ్చే నెలలో మరో దోపిడీకి పౌరసరఫరాల శాఖ నీడలోనే పక్కా పన్నాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement