జిల్లావ్యాప్తంగా 2వేల ఎకరాలలో సాగు
● ఆకుకూరల సాగు ● శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ! ● రైతులే చిరువ్యాపారులుగా మారుతున్న వైనం
రాయచోటి టౌన్: మనం తినే రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. మంచి ఆరోగ్యం కోసం, రక్తహీనత వంటి సమస్యల నుంచి బయటపడాలన్నా మాంసానికి బదులుగా ఎక్కువగా ఆకుకూరలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో చిర్రాకు, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, బచ్చలకూర, చుక్కాకు వంటి వివిధ రకాల ఆకుకూరలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. రైతులు బోరుబావుల కింద ఉన్న కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని చెన్నముక్కపల్లె, నక్కవాండ్లపల్లె, ఎగువ అబ్బవరం తదితర గ్రామా ల్లో ఇది ప్రధాన జీవనాధారంగా మారింది. అయితే, పండించిన పంటను మార్కెటింగ్ చేసుకునే క్రమంలో రైతుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. దళారులు, మధ్యవర్తులను నమ్ముకోలేక రైతులే నేరుగా మార్కెట్లకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది.
అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 2 వేల ఎకరాలలో ఆకుకూరల సాగు జరుగుతోంది. జిల్లాలో ఎక్కువగా రామసముద్రం, గుర్రంకొండ, మదనపల్లె, చిన్నమండెం, రాయచోటి ప్రాంతాలలో రైతులు ఈ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కర్నాటక బార్డర్‌లో కూడా వీటి సాగు బాగుంది. అయితే మన ప్రాంతంలో పండించే ఆకుకూరలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి మార్కెటింగ్ చేసేంత భారీ స్థాయిలో పండటం లేదు. మన ప్రాంత అవసరాలకే ఇవి సరిపోతున్నాయి. కర్ణాటకలో ఉండే వాతావరణ ప్రభావం వల్ల అక్కడి ఆకుకూరల్లో నాణ్యత ఎక్కువగా ఉండటంతో బార్డర్ ఏరియాలో వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. – సుభాషిణి, అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిణి


