పొట్టకూటి కోసం ఆటోలో కూలి పనులకు వెళ్లిన మహిళా కూలీలకు శనివారం ఊహించని ‘వింత’ ప్రయాణీకుడు తారసపడ్డాడు. పెద్దపంజాణి మండలం లింగమనాయునిపల్లెకు చెందిన కొందరు కూలీలు ఆటోలో చౌడేపల్లె మండలం దొనపల్లెకు బయలుదేరారు. తెల్లవారకముందే ఆటో స్టార్ట్ అవ్వగానే.. ఒక కోతి బావ దర్జాగా వచ్చి ఆటో ఎక్కేసింది. కాసేపు షికారు చేసి దిగిపోతుందిలే అనుకుంటే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోను, అందులోని కూలీలను అస్సలు వదల్లేదు. ముఖ్యంగా మునిరత్నమ్మ అనే కూలీపై మనసు పారేసుకున్న వానరరాజు.. ఆమె పక్కనే సీటు ఖరారు చేసుకున్నాడు. ఆమె ఆటో ఎక్కితే ఎక్కడం, కిందకు దిగితే దిగడం చేస్తూ నీడలా వెంటాడాడు. మధ్యలో ’మా సీట్లో నువ్వేంట్రా బాబూ’ అంటూ తోలేయడానికి ప్రయత్నించిన శ్రావణి అనే కూలీకి గట్టిగా ‘కాటు’ రుచి చూపించి సైలెంట్ చేసేశాడు. ఇలా కూలీలకు తోడుగా సుమారు 25 కిలోమీటర్ల దూరం ఆటోలోనే ఉచితంగా ప్రయాణించాడు. ‘కూలి కోసం మేము వెళ్తే.. మమ్మల్ని ఆడుకోవడానికి దేవుడే ఈ వానరాన్ని పంపాడేమో‘ అంటూ కూలీలు నవ్వుకున్నారు. ఆటోలో మనుషులతో పాటు దర్జాగా ప్రయాణిస్తున్న కోతిని చూసి రోడ్డుపై వెళ్లే జనాలు నోరెళ్లబెట్టారు. ఈ సరదా దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. –రసూల్, చౌడేపల్లె


