తంబళ్లపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జి లేకపోవడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈనెల 27,28 తేదీల్లో పార్టీ తలపెట్టిన వర్చువల్ మహానాడు ఏర్పాట్లపై శనివారం వెలుగు కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే కొందరు కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని, పార్టీ కోసం కష్టపడేవారిని ఎందుకు పిలవరని నిలదీశారు. మండలపరిషత్ అభివృద్ధి పనుల నిధులను వాటాలు పెట్టుకుని స్వాహా చేస్తున్నారని ఓ వర్గంవారు మరో వర్గంపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. చేసేది లేక టీడీపీ మండల అధ్యక్షులు సమావేశాన్ని నిలిపివేశారు. బయటకురాగానే కొందరు మండల పార్టీ అధ్యక్షుడు, మహిళా నాయకురాలు సిద్దమ్మలపై దుర్బాషలాడటంతో బాహాబాహాకి దిగారు. ఈ పంచాయితీ పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ఈ విషయమై ఎస్.ఐ అనిల్‌కుమార్ వివరణ ఇవ్వగా ఇరువర్గాలు ఇది పార్టీ విషయమని, మేము చర్చించుకుంటామని వెళ్లిపోయినట్లు తెలిపారు.
బాహాబాహీకి దిగిన తెలుగు తమ్ముళ్లు


