జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్
పీలేరురూరల్: చెరువు సుందరీకరణతో ఆహ్లాదకర వాతావరణం ప్రజలకు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డితో కలసి అయ్యపునాయుని చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అయ్యపునాయునిచెరువుకు పింఛా నది నుంచి మంచినీటి సరఫరాకు 2.5 కిలో మీటర్లు పైపులైన్లు వేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.చెరువులో పేరుకుపోయిన పూడికలు తొలగించాలన్నారు. వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో చెరువుకట్టపై చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్క్, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పైపులైను ఏర్పాటుకు రూ. 3 కోట్లు, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌కు రూ. 46 లక్షలు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. తహసీల్దార్ ఎం. శివకుమార్, ఇరిగేషన్ డీఈ చావ్లానాయక్, వాటర్‌షెడ్ ఏపీడీ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


