ప్రశాంతంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

ప్రశాంతంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి పూడికతీత పనులపై దృష్టి సారించాలి ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు జనగణన పాదర్శకంగా నిర్వహించాలి అనధికార లేఔట్లను గుర్తించాలి

మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 41 సెంటర్లలో ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ప్రథమ సంవత్సరం జనరల్‌ 2372 మంది విద్యార్థులకు 2258 మంది హాజరయ్యారు. ఒకేషన్‌లో 198 మందికి 182 మంది హాజరయ్యారు.ద్వితీయ సంవత్సరం 1541 మంది విద్యార్థులకు 1462 మంది హజరయ్యా రు. లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని డీఐఈఓ రవి తనిఖీ చేశారు.

పుంగనూరు: ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యసేవలు అందించేలా డాక్టర్లు, సిబ్బంది పని చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పీహెచ్‌సీలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. కార్యక్రమంలో డాక్టర్లు తేజస్విని, కిరణ్మయి, పీహెచ్‌సిల సూపర్‌వైజర్లు ప్రభాకర్‌, సిద్దార్థరెడ్డి, అమరనాథ్‌, అబ్దుల్‌హాకీం తదితరులు పాల్గొన్నారు.

చౌడేపల్లె: భూమిపై పడే ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకేలా చేయడం, సమీపంలోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరేందుకు వీలుగా ఉన్న సప్లై, ఫీడర్‌ చానల్స్‌ పూడిక తీతపనులపై దృష్టి సారించాలని డ్వామా పీడీ వెంకటరత్నం సూచించారు. గురువారం ఆయన దిగువపల్లె, కాగతి పంచాయతీల్లో జరుగుతున్న సప్లై చానల్స్‌ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని చానల్స్‌లో పూడిక తీతపనులు చేపట్టేలా చూడాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.

కలికిరి: మండల పరిధిలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌,ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కలికిరిలోని సీవీ భాస్కర్‌రెడ్డి అండ్‌ సన్స్‌, కొరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కేరాఫ్‌ మన గ్రోమోర్‌, శశి ఆగ్రోమార్ట్‌ దుకాణాల్లో రికార్డులలోని 8.775 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 241.75 లీటర్ల పురుగు మందులు గుర్తించి సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.5,97,100 ఉంటుందని వారు తెలిపారు. వీటి అమ్మకాలను నిలుపుదల చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు లక్ష్మణ్‌కుమార్‌, హరినారాయణ, మండల వ్యవసాయాధికారిణి ఎం.హేమలత పాల్గొన్నారు.

తంబళ్లపల్లె: జనగణన కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని న్యూఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్‌ గోపాల్‌ అగర్వాల్‌ తెలిపారు. గురువారం కేంద్ర కమిటీ ఎస్‌ఐ గ్రేడ్‌–1 సునిల్‌కుమార్‌మీనా, ఈడీసీఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుప్రజ్‌తో కలిసి తంబళ్లపల్లెలో పర్యటించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో జనగనణన కార్యక్రమంపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి సమాచారంతో జనగణన పూర్తి చేయాలన్నారు. ఎవరూ లేకపోతే ఇంటికి తాళం వేసినట్లు గుర్తించాలన్నారు. గత జనాభా లెక్కలకు ఇప్పటి లెక్కలకు ఎక్కువ వ్యత్యాసం వస్తే మరోసారి వెరిఫికేషన్‌ తప్పదన్నారు. డీఎల్‌డీఓ లక్ష్మిపతి, జిల్లా ఇన్‌చార్జి స్టాటికల్‌ అధికారి విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: పీకేఎండీఏ సంస్థ పరిధిలోని అనధికార లేఔట్లను గుర్తించాలని పీకెఎండీఏ వైస్‌ చైర్మన్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ అన్నారు. గురువారం స్థానిక పలమనేరు,కుప్పం, మదనపల్లె పట్టణాభివృధ్ది సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌శాఖల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గుర్తించిన అక్రమ లేవుట్‌లను రెగ్యులర్‌ చేసుకోవాలని సంబంధిత సెకట్రరీల ద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు. పరిపాలనాపరంగా చేపట్టాల్సిన చర్యల గురించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement