నవనీతుడి చెంత.. నానా విధాల చింత! | - | Sakshi
Sakshi News home page

నవనీతుడి చెంత.. నానా విధాల చింత!

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

నవనీతుడి చెంత.. నానా విధాల చింత!

రెండేళ్లుగా ఆలయ కమిటీకి దిక్కులేదు!

కురబలకోట: కురబలకోట మండలంలోని తెట్టు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అంటే భక్తి ప్రపత్తులకు, అపార విశ్వాసానికి ప్రతీక. సంతాన వరప్రసాదుడిగా పేరుగాంచిన ఈ స్వామివారికి ఆంధ్ర, కర్ణాటకతో పాటు వివిధ దేశాల్లో వేలాది మంది భక్తులు ఉన్నారు. ఒకప్పుడు నిత్య కల్యాణం పచ్చతోరణంలా, భక్తులతో కళకళలాడిన ఈ పురాతన చారిత్రక క్షేత్రం.. నేడు కూటమి ప్రభుత్వ పట్టింపులేనితనం, నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

గతంలో వైభవం.. నేడు నిర్వేదం!

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆలయ కమిటీ చైర్మన్‌గా కొరివి జగన్నాథరెడ్డి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏర్పాటు చేసిన బృందావన్‌ పార్కు నిర్వహణను గాలికొదిలేశారు. పిచ్చిమొక్కలు మొలిచి, కనీస పర్యవేక్షణ కరువై పార్కు అధ్వానంగా మారింది.

రూ.90 లక్షల నిధులున్నా..

గత జగన్‌ ప్రభుత్వంలో ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధతో రూ. 90 లక్షల సీజీఎఫ్‌ నిధులు మంజూరు చేయించారు. అయితే, ఆ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ కూటమి నేతలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. కొత్తగా నిర్మించిన రాజగోపురం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు, కనీసం దానికి రంగులు వేద్దామన్న ధ్యాస కూడా అధికారులకు లేదు. ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్‌, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులు ఇంకా మొదలుకానే లేదు.

● ఈ చారిత్రక ఆలయానికి ఏకంగా 147 ఎకరాల భూ మాన్యాలు ఉన్నాయి. దీని ద్వారా వచ్చే ఆదాయంతో పాటు నిత్యం భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. వీటికి తోడు, ఇటీవల ముగిసిన తెట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు వేసిన ప్రత్యేక హుండీ కానుకల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, దాన్ని ఏం చేశారనేది వెల్లడించే నాథుడే కరువయ్యాడు.

ఆలయ అధికారి వివరణ

తీవ్ర విమర్శలు, ఆరోపణలపై ఆలయ అధికారి మునిరాజను వివరణ కోరగా.. ఆలయంలో పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంపౌండ్‌ వాల్‌ పనులు త్వరలోనే ప్రారంభించాల్సి ఉందన్నారు. అయితే, ఆలయ కమిటీ నియామకం అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు.

అభివృద్ధికి కృషి చేశా!

నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, సర్పంచ్‌ మనోహర్‌రెడ్డిల సహకారంతో ఆలయం చుట్టూ సీసీ రోడ్లు, రూ.9 లక్షలతో బృందావన్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్స వాలను వైభవంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఎమ్మెల్యే చొరవతో రూ.90 లక్షల నిధులు కూడా మంజూరు చేయించాం. –కొరివి జగన్నాథరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌

ఆలయ అభ్యున్నతిని పర్యవేక్షించాల్సిన ‘ఆలయ కమిటీ’కాలపరిమితి ముగిసి రెండేళ్లు కావస్తున్నా కూటమి ప్రభుత్వం ఇంతవరకు కొత్త కమిటీని నియమించలేదు. స్థానిక అధికార పార్టీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కమిటీ నియామకాన్ని తొక్కిపెట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమిటీ లేకపోవడంతో ఆలయ నిర్వహణతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్య క్రమాలు పూర్తిగాకుంటుపడుతున్నాయి.

కూటమి నిర్లక్ష్యంతో ప్రాభవం కోల్పోతున్న తెట్టు వేణుగోపాలుడి క్షేత్రం!

రూ.90 లక్షల నిధులున్నా ఆగిన పనులు

147 ఎకరాల భూములున్నాకరువైన ఆలనా పాలన

Advertisement
 
Advertisement
Advertisement