గృహ గణనలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

గృహ గణనలో నిర్లక్ష్యం వద్దు

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

సాక్షి, మదనపల్లె: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ గణన సర్వేలో సంబంధిత సూపర్‌వైజర్లు, సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీలులేదని సెన్సెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుప్రజ్‌ అన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మదనపల్లె పట్టణానికి చెందిన గణన సూపర్‌వైజర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ఇప్పటిదాకా పూర్తయిన శాతంపై సమీక్షించారు. గణన విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పనితీరులో జాప్యం, నిర్లక్ష్యంపై ప్రత్యేకంగా సమీక్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ గణన కార్యక్రమాన్ని ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి యాప్‌లో పేర్కొన్న సమగ్ర వివరాలను కచ్చితంగా నమోదు చేసి తీరాలని అన్నారు. గణన జరగని గృహాలు, అందుబాటులో లేని స్థానికుల సమాచార సేకరణ విషయంలో ఈ గడువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్వేకు వెళ్లినప్పుడు తాళం వేసిన ఇళ్లకు సంబంధించిన యజమానులకు ఫోన్‌ ద్వారా సంప్రదించి వివరాలు తీసుకోవాలని సూచించారు. ఆయనతోపాటు జిల్లా సెన్సెస్‌ అధికారి రెడ్డి విష్ణుప్రియ, డివిజనల్‌ డెవలప్మెంట్‌ అధికారి లక్ష్మీపతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement