బొప్పాయి.. ధర పడిపోయి.. | - | Sakshi
Sakshi News home page

బొప్పాయి.. ధర పడిపోయి..

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

మార్కెట్‌లో కిలో రూ.12

నెల రోజుల కిందట రూ.28

సగానికి పైగా తగ్గిన రేటు

ఆందోళనలో రైతులు

గుర్రంకొండ : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన బొప్పాయి పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో ధర రూ.12 వరకు ఉంది. నెల రోజుల ముందు రూ.28 వరకు పలికింది. ప్రస్తుతం సగానికిపైగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవే ధరలు కొనసాగితే కనీసం పెట్టుబడి ఖర్చు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం బొప్పాయి సాగుకు దుక్కులు దగ్గర నుంచి నారుమొక్కలు, ఎరువులు, మందుల ఖర్చు, పంట కోతకొచ్చే వరకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు వస్తుంది.

బయటి రాష్ట్రాల్లో మొదలైన దిగుబడి

ఇక్కడ బొప్పాయి ధరలు పతనం కావడానికి ప్రధాన కారణం బయటి రాష్ట్రాల్లో బొప్పాయి దిగుబడి ప్రారంభం కావడమేనని వ్యాపార వర్గాలు అంటున్నాయి. వర్షాల కారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బొప్పాయి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండేది. ప్రస్తుతం వర్షాలు కుదట పడడంతో అక్కడి రాష్ట్రాల్లో బొప్పాయి కోతలు మొదలయ్యాయి. దీంతో ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాలకు ఆ రాష్ట్రాల బొప్పాయే వెళుతోంది. దీంతో ఇక్కడి బొప్పాయికి డిమాండ్‌ తగ్గడంతో ధరల పతనానికి కారణంగా చెప్పవచ్చు.

తరలిపోతున్న వ్యాపారులు

సాధారణంగా ఈ సీజన్‌లో బయటి రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడే మకాం వేస్తుంటారు. సుమారు ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటూ పడమటి మండలాల్లోని బొప్పాయి తోటల వద్దకే వెళ్లి రైతులతో మాట్లాడి అక్కడే బొప్పాయిని కొనుగోలు చేస్తుంటారు. కూలీలు, వాహనాలను వారే తీసుకొచ్చి తోటల వద్దనే బొప్పాయిని కోత వేసి బయటి రాష్ట్రాలకు తరలించేవారు. ప్రస్తుతం బయటి రాష్ట్రాల్లోనే బొప్పాయి పంట దిగుబడి ప్రారంభం కావడంతో వ్యాపారులు ఒక్కొక్కరు తరలిపోతున్నారు. రవాణా ఖర్చులు కలిసి వస్తుండడంతో వారు అటువైపే మొగ్గు చూపున్నారు. ప్రస్తుతం లోకల్‌ వ్యాపారులే బొప్పాయిని కొనుగోలు చేసి బెంగళూరు, చెన్త్నె వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement