కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

రామసముద్రం : మండలంలోని పెద్దకురప్పల్లి పంచాయతీ బసవన్నకట్టలో ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ హృషికేశవరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బసవన్నకట్టకు చెందిన విజయ్‌ కుమారుడు తేజకు 2021లో శివయ్య కుమార్తె రమ్యను(22) ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలంగా సంసార జీవితంలో కుటుంబ కలహాలు రావడంతో.. మనస్తాపానికి గురైన రమ్య శనివారం ఇంట్లో ఎలుకల నివారణ మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రమ్యను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

పిడుగుపాటుకు

వృద్ధుడు మృతి

సదుం : పిడుగు పాటుకు వృద్ధుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గొంగివారిపల్లె పంచాయతీ పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90), సుశీలమ్మ దంపతులు గ్రామ సమీపంలోని పొలం వద్దకు వెళ్లారు. ఐదు గంటల ప్రాతంలో వర్షం పడటంతో చింతచెట్టు కిందికి చేరారు. పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడే మృతి చెందాడు. సుశీలమ్మ స్వల్పంగా గాయపడగా, తాళిబొట్టు ముక్కలు కావడంతోపాటు, ఫోన్‌ పగిలిపోయింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కర్ణాటక యువకుడిపై దాడి

మదనపల్లె టౌన్‌ : కర్ణాటక యువకుడిపై మదనపల్లెలో దాడి జరిగిన సంఘటన ఆదివారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయల్‌పాడు చీకటివారిపల్లికి చెందిన రాజేంద్ర(33) పిన తల్లి జ్యోతి కురబలకోట మండలంలోని అంగళ్ళులో ఉంటోంది. ఆమె కుటుంబీకులతో గొడవ పడి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో.. పినతల్లిని చూడటానికి రాజేంద్ర కర్ణాటక నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న జ్యోతిని పలకరించి కారణాలు అడగి తెలుసుకున్నాడు. అనంతరం జ్యోతి భర్త నరేష్‌ను రాజేంద్ర నిలదీయడంతో ఆగ్రహించి నరేష్‌ బండరాయితో రాజేంద్ర తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నాడు. స్థానిక రెండవ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement