మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కష్టాలు తారా స్థాయికి చేరాయి. గత మూడు నెలలుగా ఆస్పత్రిలో తాగు నీటి కష్టాలు తలెత్తడంతో రోగులు, వారి అటెండర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వివిధ మండలాలు, ప్రాంతాల నుంచి జిల్లా ఆస్పత్రికి వచ్చిన రోగుల అటెండర్లు.. బయటి చిల్లర దుకాణాలలో బాటిల్ రూ.25తో కొనుగోలు చేస్తున్నామని ఆరోపించారు. నీళ్లు కూడా సరఫరా చేయలేని ఈ ఆసుపత్రికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయన్నారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న తాగు నీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
రసవత్తరంగా సాగిన సీపీఎల్–2
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో సీపీఎల్ 2 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్పార్టన్ వారియర్స్, పాయ్ వైస్రాయ్ క్రికెట్ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన పాయ్ వైస్రాయ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు తీసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన స్పార్టన్ వారియర్స్ జట్టు 17.5 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓటమి పాలైంది. అలాగే మధ్యాహ్నం ఎన్‌కే స్పోర్ట్స్, ఆదిత్యా అండ్ బీఆర్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆదిత్య అండ్ బీఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 19.4 ఓవర్లు ఆడి పది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎన్‌కే స్పోర్ట్స్ క్రికెట్ జట్టు 19.5 ఓవర్లలో 150 పరుగులు చేసి ఒక పరుగుతో విజయకేతనం ఎగురవేసింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులను కై వసం చేసుకున్న శశాంక్, హేమాద్రి నాయుడులకు ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ జిల్లా జడ్జి దివాకర్, సీడీసీఏ లీగల్ కమిటీ చైర్మన్ సత్యశ్రీనివాస్, పసుపులేటి శివ, వెంకటేష్‌లు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, యోగేష్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీధర్ కుమార్, కోచ్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.


