మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పీడీ యాక్టు ప్రయోగించాలని పేర్కొన్నారు. గురువారం మదనపల్లె లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాస్థాయి క్రైమ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలోని వివిధ కేసుల పురోగతిని సమీక్షిస్తూ పోలీసు అధికారులకు దిశానిర్దేశం జారీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, వార్డుల స్థాయిలో పోలీసు పర్యటనలు పెంచాలని సూచించారు. గతంలో గొడవలకు పాల్పడిన వారు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలన్నారు.జిల్లాలో గంజాయి విక్రయాలు, రవాణాపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వ్యాపార వర్గాలు, అపార్టుమెంట్ వాసులతో సమన్వయం చేసుకుని ప్రధాన కూడళ్లలో కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఎస్పీ సూచించారు.దర్యాప్తులో పారదర్శకత కోసం ఈ–సాక్ష్య యాప్ వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగించి బాధితులను త్వరగా గుర్తించే చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రాఫిక్ ఉల్లం ఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హత్య, అత్యాచారం, పోక్సో, ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మదనపల్లి డీఎస్పీ బి.పావని, జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
బయో–చెక్ కిట్లతో
మందుబాబుల ఆగడాలకు చెక్
అన్నమయ్య జిల్లాను గంజాయి, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే సంకల్పంతో పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి 500 కిట్లు, డీజీపీ కార్యాలయం నుంచి మరో 200 కిట్లు కలిపి మొత్తం 700 ‘బయో–చెక్ రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్లు’ జిల్లాకు వచ్చాయి. ఇకపై మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టనున్నట్లు జిల్లా ఎస్పీ ధీర తెలిపారు. గురువారం అత్యాధునిక కిట్లను ఎస్పీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో పోలీసు అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకోసం పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచిన జిల్లా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి హాజరైన ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ వి.వేమారెడ్డి కిట్ల వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


