యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

May 15 2026 10:44 AM | Updated on May 15 2026 10:44 AM

గాలివీడు: మండలంలోని బండమీదపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అన్నం వనిత(19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, పూలింకుంట పంచాయతీ పరిధిలోని హరినాథ రెడ్డి, కవిత దంపతుల కుమార్తె వనిత కడపలో డిగ్రీ చదువుతోంది. ఇటీవల సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చింది.బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు.

జీవితంపై విరక్తితో భవన నిర్మాణ కార్మికుడు..

మదనపల్లె టౌన్‌: ఉరి వేసుకుని భవన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన గురువారం ఉదయం మదనపల్లె పట్టణంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి రెండవ పట్టణ ఎస్‌ఐ నాగేశ్వర్‌ రావు, సీఐ మహమ్మద్‌ రఫీ తెలిపిన వివరాలు.. స్థానిక నిమ్మనపల్లె రోడ్డు, దిగువ కమ్మపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న నరసింహులు కొడుకు అగరం సూరి (45), భవన కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏం కష్టం వచ్చిందో ఏమో.. సూరి జీవితం పై విరక్తి చెందాడు. తాను ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకున్నాడు. సూరి ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబీకులను ఆరా తీశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు.

పాడి ఆవు అపహరణ

పుంగనూరు: పట్టణంలోని మేలుపట్లకు చెందిన వెంకటేష్‌కు చెందిన లక్షరూపాయల విలువ చేసే పాడి ఆవును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి తీసుకెళ్లారు. గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సీసీ కెమెరాలలో దొంగ తెల్లవారుజామున ఆవును దొంగలించుకెళ్లడం నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు నా బిడ్డను

చిత్రహింసలు పెడుతున్నారు

మదనపల్లె టౌన్‌: నేరం చేశాడని ముదివేడు, మదనపల్లె పోలీసులు నా బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారని గురువారం సాయంత్రం తల్లిదండ్రులు మదనపల్లె జిల్లా ఎస్పీ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పులిచెర్ల మండలం, కల్లూరు గ్రామం, ఉప్పుటూరుకు చెందిన శాంతమ్మ, రామకృష్ణల కుమారుడు హరిప్రసాద్‌ స్థానికంగా వైద్యం చేస్తుంటాడు. కోడలు ఉమా వాల్మీకిపురం ఆసుపత్రిలో జీడీఏ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తన కుమారున్ని 10రోజుల క్రితం మదనపల్లె, ముదివేడు పోలీసులమని పట్టుకెళ్లి తమకు అప్పగించ లేదని ఆరోపించారు. విడిచిపెట్టాలంటే 50,000 డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. తాము అంత డబ్బు కట్టలేమని, తమ బిడ్డను విడిపించాలని విజ్ఞప్తి చేశారు

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

పెద్దతిప్పసముద్రం: మండలంలోని టి.సదుంకు చెందిన గోపోరుపల్లి వెంకట్రమణప్ప (63) రెండు నెలలుగా అదృశ్యమైనట్లు భార్య మునిలక్ష్మమ్మ గురువారం పేర్కొంది. తన భర్త మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఈ ఏడాది మార్చి 19న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంత వరకు తిరిగి ఇంటికి రాలేదని ఆమె తెలిపింది. అప్పటి నుంచి చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఊళ్లకు వెళ్లి విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement