సాక్షి, మదనపల్లె: సాధారణంగా ఎండలు, ఉక్కపోత పరిస్థితులు టమాట పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి. ఈ సారి దిగుబడులపై ప్రభావం పడకుండా రైతులు ప్రత్యేక సాగు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా టమాట దిగుబడి ఆశాజనకంగానే ఉంది. ఈనెలాఖరుకు దిగుబడి రెట్టింపుకానుంది. ఇప్పటికే టమాట సీజన్ మొదలైంది. మదనపల్లె మార్కెట్‌కి వస్తున్న టమాట దిగుబడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా ఈనెల ప్రారంభంలో టమాట ధరలు ఆశించినంత లేకున్నా.. ప్రస్తుతం మెల్లగా ఎగబాకుతున్నాయి. గత రెండురోజుల్లో ధర పెరగడంతో రైతుల్లో ఆశలు నెలకొంటున్నాయి. మదనపల్లె మార్కెట్‌కు ఈనెల ఏడున 303 టన్నుల టమాట రాగా మొదటి గ్రేడ్ కిలో రూ.27 పలికింది. 13న 398 టన్నులు రాగా కిలో రూ.28 పలికింది. 14న 437 టన్నులు రాగా కిలో రూ.29 పలికింది. ఇలా దిగుబడి పెరుగుతూ వస్తూనే ధరలు మెల్లగా పెరుగుతున్నాయి.


