మెడికిల్‌షాపులు | - | Sakshi
Sakshi News home page

మెడికిల్‌షాపులు

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో మెడికల్‌ షాపుల నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మెడికల్‌ స్టోర్లపై డ్రగ్‌ కంట్రోల్‌ శాఖ నిఘా అంతంతమాత్రమే ఉండటంతో ప్రిష్కిప్షన్‌ లేకుండానే మందులు ఇష్టారాజ్యంగా అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోడంతో మెడికల్‌ మాఫియా పెట్రేగిపోతోందని, మందులు కొనుగోలు చేసిన ప్రజలను కిడ్నీ, షుగర్‌ వ్యాధుల భారిన పడేలా చేస్తున్నారని సీపీఐ, ఏఐటీయూసీ వంటి ప్రజా సంఘాల నాయకులు క్రిష్ణప్ప, సాంబశివ, మురళి ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 500 కు పైగా మందుల దుకాణాలు ఉండగా, అధికారుల దాడులు, కేసుల నమోదు నామమాత్రంగా ఉన్నాయి. జిల్లాకు జరిమనాల రూపంలో వచ్చిన ఆదాయం ఇప్పటి వరకు సున్న శాతంగా ఉంది.

నిబంధనల ఉల్లంఘన

మెడికల్‌ షాపుల్లో ఫార్మసిస్ట్‌ సర్టిఫికెట్‌ ఒకరిదైతే కౌంటర్లో మందులు అమ్మేది మరొకరనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం డీఫార్మసీ, బీఫార్మసీ లేకుండానే యాంటీ బయాటిక్స్‌, షెడ్యూల్‌–హెచ్‌, హెచ్‌1 డ్రగ్స్‌ను సైతం ప్రిస్క్రిప్షన్‌ లేకపోయినా దుకాణాలు, ఆస్పత్రులలో జోరుగా విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బ్రాండెడ్‌ మందుల పేరుతో అక్షరం తేడాతో కల్తీ మందులు, గడువు తీరిన మందులకు కొత్త లేబుల్స్‌ వేసి అమ్మకాలు చేస్తున్నా సంబంధిత అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవనే విర్శలు ఉన్నాయి. పర్మిషన్లు, రెన్యువల్స్‌ లేకుండానే ఇష్టారాజ్యంగా దుకాణాలు నడుపుతున్నట్లు అధికారిక గణాంకాలే బహిర్గతం చేస్తున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ

జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ శాఖలో సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ కొరవడింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌–ఒకరు ఉన్నారు.జిల్లా పర్యవేక్షణ అధికారులు ముగ్గురు ఉండాలి. అయితే ఒకరే ఉన్నారు. జూనియర్‌ అసిస్టెంట్లు ఇద్దరు ఉండాలి. అదికూడా ఒకటే భర్తీ అయింది. ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. దీంతో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. రికార్డుల నిర్వహణ, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఫైల్‌ మూవ్‌మెంట్‌, ఆఫీస్‌ పనులు చేయడానికి ఏడుగురు సిబ్బంది ఉండాలి.అయితే ఇద్దరే ఉన్నారు.నిబంధనల ప్రకారం ఒక్కో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నెలకు 20 షాపులు, ఏడాదికి 240 షాపులను తనిఖీ చేయాలి. ముగ్గురు ఉంటే ఏడాదికి 720 తనిఖీలు జరగాలి. కానీ ఒక్క డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే ఉండటంతో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు కేవలం 12 తనిఖీలు మాత్రమే జరిగాయి. టార్గెట్‌లో 5% కూడా పూర్తి కాలేదని తెలిసింది. తనిఖీలు లేకపోవడంతో కేసుల నమోదు శూన్యంగా మారింది. డ్రగ్స్‌ అండ్‌ కాస్మటిక్స్‌ యాక్ట్‌–1940 ప్రకారం ఫార్మసిస్ట్‌ లేకుండా మందులు విక్రయిస్తే రూ. 20 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించ వచ్చని చట్టాలు చెబుతున్నాయి. కల్తీ మందులు విక్రయిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. గత ఏడాది పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాలో తనిఖీల ద్వారా రూ.18.7 లక్షల ఆదాయం వచ్చింది. అన్నమయ్య జిల్లాలో మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు జరిమానాల రూపంలో వచ్చిన ఆదాయం రూ.0. సగటున ఏడాదికి రూ.15–20 లక్షల ఆదాయానికి గండి పడుతోందని సంబంధిత అధికారులే బహిరంగంగా చెబుతున్నారు.

నిబంధనల ఉల్లాంఘనపై చర్యలేవీ?

నిబంధనల ప్రకారం ఫార్మసిస్ట్‌ లేకుండా మందులు విక్రయిస్తే లైసెన్‌న్స్‌ రద్దు, ఏడాది జైలు శిక్ష. కల్తీ మందులు విక్రయిస్తే 10 ఏళ్ల వరకు జైలు, రూ.10 లక్షల జరిమానా ఉంటుంది. లైసెన్స్‌ లేకుండా షాపు నడిపితే 5 ఏళ్ల జైలు. అయినా జిల్లాలో ఒక్క షాపుపైనా చర్యలు లేవనే విమర్శలు ఉన్నాయి.

అధికారులు మౌనం వీడాలి

దాడుల వివరాలు, నమోదైన కేసుల లెక్క అడిగితే జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారి సంధ్య వెల్లడించడం లేదు. సిబ్బంది కొరత పేరు చెప్పి తప్పించు కుంటున్నారని, మామూళ్ల మత్తులో అధికారులు జోగుతుండటంతోనే చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ, ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు కృష్ణప్ప, మురళి, సాంబశివలు ఆరోపిస్తున్నారు.

డిమాండ్లు ఇవి..

ఖాళీగా ఉన్న 5 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, ప్రతి మండలంలో నెలకు రెండు సార్లు ఆకస్మిక దాడులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన షాపుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ స్వయంగా జోక్యం చేసుకుని డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం

అధికారుల దాడులు నామమాత్రం

ఫార్మసీ సర్టిఫికెట్‌ ఒకరిది..

అమ్మేది మరొకరు

జరిమానాల రూపంలో జిల్లాకు

వచ్చిన ఆదాయం: 0

చర్యలు తీసుకోవాలి

ప్రజలు, రోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని మెడికల్‌ స్టోర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు క్రిష్ణప్ప డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌తో పాటు ఆరోగ్య శాఖామంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

క్రిష్ణప్ప,సీపీఐ నాయకుడు

Advertisement
 
Advertisement
Advertisement