రెచ్చిపోతున్న ఇసుక మాఫియా | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

గుర్రంకొండ : జిల్లాలో రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా షరామామూలుగా మారింది. అక్రమణ రవాణాపై అడిగే వారు కానీ అడ్డుకునేవారు గానీ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఇసుకాసురులు చెలరేగుతున్నారు. ఇసుక టిప్పర్‌ రోడ్డుపై వెళ్లిందంటే వాహనం వెనుక వెళ్లే ద్విచక్రవాహనదారుల కళ్లు మండిపోవాల్సిందే. గాలికి ఇసుక కొట్టుకువచ్చి కళ్లలో పడుతుండటంతో.. ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. జనావాసాల మధ్యలో వెళ్లేటప్పుడు ఇసుకపై పట్టగానీ, నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకోక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇటీవల పోలీసులు పట్టుకుని ఇసుక టిప్పర్లకు జరిమానాలు విధించారు. మూడు రోజుల పాటు టిప్పర్లపై పట్ట కట్టి ఇసుక రవాణా చేశారు. అయితే గత రెండు రోజులుగా కథ షరామామూలుగా మారింది. అధికారులకు పోలీసులకు సవాల్‌ విసురుతూ మళ్లీ పట్ట కట్టకుండా జనావాసాల మధ్య రాత్రింబవళ్లు ఇసుక టిప్పర్లు యథేచ్ఛగా తిరుగుతుండటం గమనార్హం.

కలెక్టర్‌ మందలించినా..

జిల్లా నలుమూలల నుంచి ఇసుక టిప్పర్లు గుర్రంకొండ మీదుగా మదనపల్లె వైపు, కర్ణాటక వైపు వెళుతున్నాయి. ప్రతి రోజు గంటకొకమారు ఇసుక టిప్పర్‌ వెళుతుండటంతో కష్టాలు తప్పడం లేదని జనం ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై వారం రోజుల కిందట ద్విచక్రవాహనదారుల కళ్లలో ఇసుక రాలిపడడంతో టిప్పర్‌ను అడ్డుకొని డ్రైవర్‌తో ఘర్షణ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాహనదారులు పేర్కొనగా.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండని టిప్పర్‌ డ్రైవర్‌ సవాల్‌ విసరడం గమనార్హం. దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో దిక్కుతోచని స్థితిలో ద్విచక్రవాహన దారులతోపాటు గ్రామస్తులు ఉన్నారు. గతంలో రెండు మార్లు స్వయంగా అప్పటి జిల్లా కలెక్టర్‌ ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారిపై ఇలాగే వెళుతున్న ఇసుక టిప్పర్‌ను నిలిపి డ్రైవర్‌ను మందలించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ఇటీవల పోలీసులు ఇసుక టిప్పర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. పట్టకట్టని టిప్పర్లకు జరిమానాలు విధించారు. డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా టిప్పర్లను తిప్పారు. అయితే మళ్లీ రెండు రోజుల నుంచి కథ షరామామూలుగా మారింది. మళ్లీ పట్టకుండా, ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా రాత్రింబవళ్లు ఇసుక టిప్పర్లను తిప్పుతుండటం గమనార్హం. దీంతో తాము తగ్గేదేలా మా దారి రహదారి అంటూ పట్టకుండా టిప్పర్లను తిప్పుతూ.. పోలీసులకు, అధికారులకు ఇసుకాసురులు సవాల్‌ విసురుతున్నారు.

యథేచ్ఛగా అక్రమ రవాణా

టిప్పర్లపై పట్ట కప్పకుండా వెళ్తున్న వైనం

జనం కంట్లో పడుతున్న ఇసుక

అధికారులకు సవాల్‌ విసురుతున్న

ఇసుకాసురులు

Advertisement
 
Advertisement
Advertisement