కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 6వ తేదీన హత్యకు గురైన కల్లమల్ల పెద్ద దస్తగిరి (53) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కడపలోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మంగళవారం ఆదేశించారు. నిత్యానందరెడ్డి ఈ నెల 11వ తేదీన కడపలోని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఎదుట న్యాయవాది నాగిరెడ్డి ద్వారా లొంగిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిత్యానందరెడ్డిని హత్య కేసు విచారణాధికారి ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మంగళవారం నిత్యానందరెడ్డిని పోలీసులు కడప రిమ్స్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకునివెళ్లారు. తరువాత కడపలోని కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. చిన్నచౌక్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి, రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్, ఎస్‌ఐ చంద్రమోహన్ తమ సిబ్బందితో కలిసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.


